సవాళ్ల మధ్య మెట్రో పయనం!
⇒ అసెంబ్లీలో ప్రస్తావన నేపథ్యంలో సర్వత్రా చర్చనీయాంశం
⇒మొత్తం 72 కి.మీ మార్గంలో 43 కి.మీ మేర పూర్తయిన పనులు
⇒ఇమ్లీబన్-ఫలక్‌నుమా మార్గంలో మొదలుకాని పనులు
⇒ అలైన్మెంట్ మార్పుపై నగర ఎమ్మెల్యేలు, ఎంపీలతో త్వరలో సమావేశం
సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన కలల మెట్రో ప్రాజెక్టు పయనం సవాళ్ల మధ్యన సాగుతోంది. 2010 సెప్టెంబరు తొలివారంలో నిర్మాణ ఒప్పందం ఖరారైనపుడు భూసేకరణకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు మొదలు.. తాజాగా పాతనగరంలో అలైన్మెంట్ మార్పుల వరకు పలు అంశాలు ప్రాజెక్టు వేగానికి బ్రేకులు వేస్తున్నాయి. ఓల్డ్‌సిటీలో అలైన్మెంట్ మార్పుపై ఎంఐఎం పార్టీ నేతలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ రూట్లో మెట్రో మార్గాన్ని మార్పు చేయాలని రాష్ట్ర సర్కారు గతంలో సంకల్పించింది. ఇదే అంశంపై తాజాగా అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగిన నేపథ్యంలో త్వరలో నగర ఎమ్మెల్యేలు, ఎంపీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చే స్తామని మున్సిపల్ పరిపాలన శాఖమంత్రి కేటీఆర్ సభలో ప్రకటించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అనుకున్న గడువులోగా(2017 జూన్ నాటికి) మెట్రో ప్రాజెక్టును పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. ఈనేపథ్యంలో ఈప్రాజెక్టు పురోగతి, చార్జీలు, నిర్మాణ సంస్థకు కలుగుతున్న ప్రయోజనాలు, ప్రాజెక్టుతో ఒనగూరే రెవెన్యూ ఆదాయం వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి.
అలైన్మెంట్ మార్పు హాట్ టాపిక్
పాతనగరంలో ప్రార్థనాస్థలాలు, చారిత్రక కట్టడాలను పరిరక్షించేందుకు 3.2 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని మూసీ నది మీదుగా మళ్లించాలని గతేడాది ప్రభుత్వం సంకల్పించింది. దీనిపై నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ నిపుణులతో సమగ్ర అధ్యయనం జరిపించింది. అయితే మూసీ నదీగర్భం నుంచి పిల్లర్లను నిర్మించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని, పర్యావరణ అనుమతులు పొందడం కష్టసాధ్యమని, ఈ మార్గం వాణిజ్యపరంగానూ గిట్టుబాటు కాదని నిర్మాణసంస్థ సర్కారుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అలైన్మెంట్ మార్పుపై తుది నిర్ణయం తీసుకోలేదు. నిర్మాణసంస్థకు ఎలాంటి లిఖిత పూర్వక ఆదేశాలివ్వలేదు. దీంతో ఇమ్లీబన్-ఫలక్‌నుమా (సుమారు 5.5 కి.మీ) మార్గంలో పనులు మొదలుకాలేదు. ఇక అసెంబ్లీ, సుల్తాన్‌బజార్ మార్గంలో పాత మార్గాన్నిఖరారు చేయడంతో పనులు ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం గౌరవానికి భంగం వాటిల్లకుండా 30 అడుగుల దూరం నుంచి ఆల్ఇండియా రేడియో దగ్గర నుంచి పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడా పనులు ఊపందుకున్నాయి. కాగా మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, ఆస్తుల సేకరణకు సంబంధించి 2010 నుంచి 2016 వరకు మొత్తం 200 న్యాయ వివాదాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇందులో 190 కేసులు పరిష్కారమయ్యాయి. మరో పదికేసుల నుంచి ఊరట లభించాల్సి ఉంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఇస్కాన్, బేగంపేట్, సికింద్రాబాద్ , సుల్తాన్‌బజార్, హైటెక్‌సిటీ వంటి కీలక ప్రాంతాల్లో ఇటీవలే న్యాయపరమైన చిక్కులు తొలగడంతో పనులు ఊపందుకున్న విషయం విదితమే.
ఇదీ ప్రస్తుత పురోగతి
ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా, నాగోల్-రహేజా ఐటీపార్క్ మొత్తం మూడు కారిడార్లలో 72 కి.మీ మార్గానిగాను ప్రస్తుతం 43 కి.మీ మార్గంలో పిల్లర్ల నిర్మాణం, వాటిపై పట్టాలు పరిచేందుకు వీలుగా వయాడక్ట్ సెగ్మెంట్ల అమరిక పూర్తయ్యింది. మరో పది కిలోమీటర్ల మార్గంలో పిల్లర్ల నిర్మాణం పనులు ఊపందుకున్నాయి. మొత్తం 2800 పిల్లర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 2000 పిల్లర్లను ఏర్పాటు చేశారు. నాగోల్-మెట్టుగూడ రూట్లో (8కి.మీ) మార్గంలో ఏడు స్టేషన్ల నిర్మాణం కూడా పూర్తయ్యింది. ఈ మార్గం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇక మియాపూర్-ఎస్.ఆర్‌నగర్ (12కి.మీ)మార్గంలో పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ రెండు మార్గాల్లో ఈ ఏడాది జూన్ తొలివారంలో ప్రజలు మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించేందుకు వీలుగా వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
నగర మెట్రో ఇతర ప్రత్యేకతలివే..
⇒డ్రైవర్‌లెస్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే వ్యవస్థ. డ్రైవర్ పని కేవలం ఆన్,ఆఫ్ బటన్లను ప్రెస్ చేయడం వరకే.
⇒బ్రేకు వేసినపుడు బోగీల్లోకి కరెంట్ సరఫరా అవుతుంది. దీంతో ద్రవ,ఘన ఇంధనాల వినియోగం తగ్గి సల్ఫర్ వంటి విషవాయుువుల ఉద్గారాలు వెలువడవు.
⇒ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేటింగ్ వ్యవస్థ. మొత్తం 72 కి.మీ మార్గాన్ని ఉప్పల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ వ్యవస్థ వద్ద నుంచి నియంత్రించడం.
⇒ రైలు ఆగినపుడు తెరుచుకునేతలుపులు.
⇒రద్దీని బట్టి ఎయిర్ కండిషనింగ్‌లో మార్పులు.
నిర్మాణ సంస్థకు వేల కోట్ల ప్రయోజనాలు..?
మెట్రో ప్రాజెక్టు మొత్తం నిర్మాణ వ్యయం రూ.14,132 కోట్లు. ఇందులో పదిశాతం కేంద్ర ప్రభుత్వం, మరో 90 శాతం నిధులనునిర్మాణసంస్థ ఎల్అండ్టీ వ్యయం చేయనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం రూ.1980 కోట్లను మెట్రో పనులకు అవసరమైన భూసేకరణ, బాధితులకు సహాయ పునరావాసం, రహదారుల విస్తరణ పనులకు వ్యయం చేయనుంది. అయితే నిర్మాణం పనులు చేపడుతున్న ఎల్అండ్టీ సంస్థకు 269 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం అప్పజెప్పింది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ విలువైన స్థలాలను సుమారు 65 ఏళ్లపాటు నిర్మాణ సంస్థకు అప్పజెప్పడంపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక 72 కి.మీ మార్గంలో ఏర్పాటు కానున్న 66 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లలో వాణిజ్య స్థలాల కేటాయింపు, దశల వారీగా 18 చోట్ల మాల్స్ నిర్మాణం, అద్దెలు, లీజుల మొత్తాలు, పిల్లర్లు, సెగ్మెంట్లకు ఏర్పాటు చేసే వాణిజ్య ప్రకటనలతో వచ్చే ఆదాయం,పార్కింగ్ ఫీజులతో నిర్మాణ సంస్థ రాబోయే 37 ఏళ్లలో సుమారు రూ. 1.18 లక్షల కోట్ల వరకు ఆర్జించనుందని, ఈ విషయంలో ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీకి ఎలాంటి ఆదాయం సమకూరదని కేవలం నిర్మాణ సంస్థ మాత్రమే గరిష్టంగా లబ్ధిపొందనుందని ఘాటుగా విమర్శిస్తుండడం గమనార్హం. అయితే ప్రపంచంలో 200 మెట్రో ప్రాజెక్టులుండగా.. ఇందులో నాలుగు మినహా మిగతా ప్రాజెక్టులన్నీ నష్టాల్లోనే నడుస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
నగర మెట్రో ప్రాజెక్టుకు ప్రయాణీ కుల ఛార్జీల రూపేణా 55 శాతం, మరో 45 శాతం వాణిజ్య స్థలాల లీజు,అద్దెల రూపేణా, మరో 5 శాతం ఆదాయం వాణిజ్య ప్రకటనల ద్వారా లభిస్తుందని సర్కారు తెలిపింది. నిర్మాణ పనులు చేపడుతున్న ఎల్అండ్టీ సంస్థ సుమారు రూ.12,718 కోట్లు సొంతంగా వ్యయం చేస్తోందని,ఈ ప్రాజెక్టు దేశంలో అతిపెద్ద పీపీపీ (పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం)తో చేపడుతున్నట్లు ప్రకటించింది. కేవలం ప్రయాణీకుల ఛార్జీల రూపేణా వచ్చే ఆదాయంతో మెట్రో ప్రాజెక్టును నడపడం సాధ్యపడదని తేల్చిచెప్పడం గమనార్హం.
చార్జీ
కనీసం రూ.13.. గరిష్టం రూ.25
మెట్రో రైళ్లలో కనీస ఛార్జీ రూ.13 ఉండబోతోంది. గరిష్ట ఛార్జీ రూ.25 వరకు ఉండే అవకాశాలున్నట్లు శాసనసభలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ తాజాగా ప్రకటించారు. ప్రయాణించే దూరాన్ని బట్టి ఐదు శ్లాబుల్లో చార్జీలుంటాయని సూచనప్రాయంగా తెలిపారు. కాగా 2010లో మెట్రో నిర్మాణ ఒప్పందం ఖరారయినప్పుడు ప్రభుత్వం ఏటా సవరించే టోకుధరల సూచీ ఆధారంగా చార్జీల పెంపు ఉంటుందని నిర్మాణ ఒప్పందంలో పేర్కొన్నారు. ప్రారంభం నాటికి టిక్కెట్, పార్కింగ్ ఛార్జీల్లో హెచ్చుతగ్గులుండే అవకాశాలున్నాయి.