అమెరికా ఆశలకు ‘ఇమిగ్రేషన్’ గండి
విదేశీ విద్యకోసం వెళ్లిన విద్యార్థులకు ఎయిర్‌పోర్ట్‌లో చుక్కెదురు
తిప్పి పంపిన అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు
ఎయిర్ ఇండియా కార్యాలయం వద్ద ఆందోళన
హైదరాబాద్: విదేశీ విద్యను అభ్యసించేందుకు అష్టకష్టాలు పడి వీసా సంపాదించి... ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన విద్యార్థులను విమానాశ్రయంలోనే ఇమిగ్రేషన్ సిబ్బంది అడ్డుకున్నారు. వీసాను తిరస్కరించి ఇక్కడికి పంపించారు. విమానం ఎక్కేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన మరికొందరు విద్యార్థులకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. బీటెక్ పూర్తి చేసిన కొందరు విద్యార్థులు ఆన్లైన్లో విదేశీ విద్య కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీసా రావడంతో అంతా సవ్యంగా సాగిపోతోందని భావించారు. ఈ నెల 15న 19 మంది ఎయిర్ ఇండియా విమానంలో యూఎస్ చేరుకున్నారు. విమానం దిగగానే అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు బ్యాంక్ లోన్, సర్టిఫికెట్లు, ఆధార్ తదితరాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ... 36 గంటల పాటు అక్కడే ఉంచుకొని తిరిగి ఇండియాకు పంపారు. ఈ నెల 19న మరికొందరు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లగా ఇదే పరిస్థితి ఎదురైంది.
దీంతో దిక్కుతోచని విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు సోమవారం హైదరాబాద్‌లోని ఎయిర్ ఇండియా కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. జనవరి 5 నుంచి 10 వరకు జరిగే ఓరియెంటేషన్ క్లాస్‌లకు హాజరుకాకపోతే.. అష్టకష్టాలు పడి చెల్లించిన లక్షల రూపాయలు వృథా కావడంతో పాటు విద్యా సంవత్సరం నష్టపోతామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
విదేశాంగ మంత్రితో చర్చిస్తా...
‘‘అమెరికాలో యూనివర్సిటీలకు చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులను వారి శ్రేయస్సు మేరకే ఆపుతాం. కొన్ని వర్సిటీలకు గుర్తింపు సమస్యలు ఉన్నాయని ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను అనుమతించడం లేదు. ఎయిర్ ఇండియా విమాన సంస్థ మాత్రమే. యూఎస్ వెళ్లి.. అక్కడ అనుమతి లభించని విద్యార్థులు సొంత ఖర్చులతో తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంపై విదేశాంగ మంత్రితో చర్చిస్తాం.’’ - కేంద్ర పౌర విమాన యాన మంత్రి అశోక్‌గజపతి రాజు