మోదీ అవతారంలో హల్చల్...
కఠ్మాండు: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఇమిటేడ్ చేయడం అంత ఈజీ కాదు. ఆయన ధరించే దుస్తులే కాకుండా మాట్లాడే తీరు కూడా ఓ ప్రత్యేక తరహాలో ఉంటుంది. ముఖ్యంగా మాట ముగింపులో సాగతీతను మిమిక్రీ కళాకారులకు అనుకరించాలంటే సాక్షాత్తు మోదీనే ముందు ప్రత్యక్షం కావాల్సిందే.
అంతకష్టమైన పనిని కష్టంగానే సాధించిన నేపాల్ కమెడియన్ మనోజ్ గుజారెల్, మోదీ అవతారంలో ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నారు. అదే అవతారంలో ఆయన పలు దేశాల్లో పర్యటించి ప్రజలను, మోదీ అభిమానులను విశేషంగా ఆకర్శించారు. ప్రధాన మంత్రిగా మోదీ తొలిసారిగా నేపాల్‌లో పర్యటించినప్పుడు ఆయనను చూసి స్ఫూర్తి పొందానని, ఆయన హావభావాలతోపాటు మాట తీరును అనుకరించేందుకు తెగ కష్టపడ్డానని, అందుకోసం ఆయన పలు ప్రసంగాల వీడియోలను భారత్ నుంచి తెప్పించుకొని మరీ అధ్యయనం చేశానని ‘నేపాల్ టైమ్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనోజ్ వెల్లడించారు.
మనోజ్ గత అక్టోబర్ నెలలో నేపాల్‌లో ప్రసిద్ధి చెందిన పశుపతి నాథ్ ఆలయానికి మోదీ అవతారంలోనే వెళ్లి పూజలు చేశారు. ఆర్థిక ప్రతిష్టంభనతో నేపాల్‌ను దెబ్బతీస్తున్న మోదీ పాపాలన్నీ కొట్టుకుపోవాలంటూ ప్రత్యేకంగా ‘చ్యామ పూజ’ నిర్వహించారు. భక్తజనాన్ని ఉద్దేశించి మోదీ తరహాలోనే మాట్లాడుతూ జోకుల మీద జోకులు వేశారు. అనంతరం భారత్ నుంచి చమురు సరఫరా జరగకపోవడాన్ని నిరసిస్తూ సైకిల్‌పై వీధుల్లో మోదీ అవతారంలో తిరిగారు. ఆ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఒకప్పుడు మోదీ అభిమానిగా ఆయన్ని అనుకరించిన మనోజ్ మారిన నేపాల్ పరిస్థితుల నేపథ్యంలో వ్యంగ్యోక్తులతో మోదీని అనుకరిస్తున్నారు.
(నేపాల్ కొత్త రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్న మధేశీ, తెరాయ్ తెగల ప్రజలు, ఆ రాజ్యాంగ రూపకల్పనకు సహకరించిన భారత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే)