immoral politics
-
టీడీపీ అడ్డదారులు: పైకి కత్తులు.. లోన పొత్తులు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పార్టీ రహిత పంచాయతీ ఎన్నికల్లో జనసేనతో అనధికారికంగా చెట్టపట్టాలేసుకున్న టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో సైతం సర్దుబాటు ముసుగులో అనైతిక రాజకీయాలకు బరితెగిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థికి ‘స్వతంత్ర’ అనే ముసుగు తగిలించినా ప్రజల తీర్పు ముందు తలవంచక తప్పలేదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉన్నందున తమ నాటకాలు చెల్లవని టీడీపీ కొత్త పద్ధతికి తెరతీసింది. అభ్యర్థులను నిలబెట్టలేక జనసేనతో సర్దుబాటు చేసుకుంది. చెరి సగం అంటూ వార్డుల్లో పోటీ చేస్తోంది. ఒకరికి బలమున్నచోట మరొకరు అభ్యర్థిని పెట్టకుండా పరస్పరం సహకరించుకునేలా లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుంది. క్షేత్ర స్థాయిలో ఈ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు విలువలు విడిచి బరిలో దిగుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మచ్చుకు కొన్ని ►జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన అడ్డదారులు తొక్కుతున్నాయి. ►అమలాపురం మున్సిపాలిటీలో 30 వార్డులున్నాయి. అతి కష్టం మీద చెరో 16 వార్డుల్లో అభ్యర్థులను పెట్టుకున్నాయి. అవీ సర్దుబాట్లతోనే. జనసేన పోటీ చేసే వార్డుల్లో టీడీపీ పోటీ చేయకుండా నాయకులు జాగ్రత్తలు తీసుకున్నారు. 3, 4, 7, 8 వార్డుల్లో జనసేన అభ్యర్థుల విజయానికి సహకరిస్తూ టీడీపీ తన అభ్యర్థులను దింపలేదు. 5, 15, 22 వార్డుల్లో టీడీపీ కోసం జనసేన తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టకుండా పరోక్ష సహకారం అందిస్తోంది. ►రామచంద్రపురం మున్సిపాలిటీలో టీడీపీకి కాస్తో కూస్తో పట్టున్నచోట జనసేన.. టీడీపీకి బలమున్న చోట జనసేన అభ్యర్థులను నిలబెట్టలేదు. ఇక్కడ 28 వార్డులకు 18 చోట్ల పోటీ జరుగుతోంది. 10 వార్డుల్లో టీడీపీ పోటీలో ఉండగా జనసేన 13 వార్డుల్లో పోటీ పడుతుంది. టీడీపీ బలంగా ఉండే కొన్ని వార్డుల్లో గతంలోనే జనసేన పోటీ నుంచి తప్పుకొంది. జనసేనకు ఒక మోస్తరు బలగమున్నచోట టీడీపీ అభ్యర్థులను బరిలోకి దింపనే లేదు. 1, 2 వార్డులు టీడీపీకి గతంలో పట్టున్నవి. ఇక్కడ జనసేన పోటీలో లేదు. ఎనిమిదో వార్డులో జనసేన పోటీలో ఉండగా టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే 21, 22 వార్డుల్లో ఈసారి జనసేన పోటీలో ఉంది. వైఎస్సార్ సీపీని ఎదుర్కొనాలనే ఏకైక లక్ష్యంతో టీడీపీ మౌనం దాల్చింది. ►మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలోనూ టీడీపీని ఓటమి భయం వెంటాడుతోంది. కనీసం డిపాజిట్ అయినా దక్కించుకోవాలని జనసేనతో పొత్తు పెట్టుకుంది. సామర్లకోటలో 5, 7, 11, 17, 27, 28, 30, 31 వార్డులను జనసేనకు వదిలేసింది. జనసేన పోటీ చేయకుండా వెనక్కు తగ్గిన 3, 4, 6, 8, 9, 10, 12, 13, 15, 16, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 29 వార్డుల్లో మాత్రమే టీడీపీ పోటీ చేస్తోంది. ►పెద్దాపురం మున్సిపాలిటీలో 29 వార్డులుండగా టీడీపీ 27 వార్డుల్లోనే పోటీ చేస్తోంది. 10, 12 వార్డులను జనసేన అభ్యర్థులకు కేటాయించి టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. పంచాయతీ తీర్పుతో గుండెల్లో రైళ్లు కొద్ది రోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విపక్ష టీడీపీ.. జనసేన దారుణ పరాజయాలను మూటగట్టుకున్నాయి. పరస్పరం సహకరించుకున్నా రెండంకెలను చేరుకోలేకపోయాయి. మున్సిపల్ ఎన్నికల్లోనైనా వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు కనీస పోటీ ఇచ్చేందుకు బహిరంగ మద్దతుతో ఈ రెండు పార్టీలూ బరిలోకి దిగాయి. ఆ పార్టీల అగ్రనేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నట్లు ప్రజల ముందు నటిస్తున్నారు. బీజేపీతో తమకు ఒప్పందమని జనసేన నేతలు చెబుతున్నారు. తీరా ఎన్నికలకొచ్చేసరికి మాట మీద నిలబడలేకపోతున్నారని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ అనైతిక పొత్తులు చూసి ద్వితీయ శ్రేణి నాయకులు, సాధారణ కార్యకర్తలు పలువురు అయోమయంలో పడుతున్నారు. సీఎం వైఎస జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలకు ప్రజలు మద్దతునిస్తూ ఏకపక్షంగా ఇస్తున్న తీర్పులతో ఈ రెండు పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఒంటరిగా పోటీ చేయలేక జనసేనతో ఒప్పందానికి రావడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. చదవండి: కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు చంద్రబాబుకు భారీ షాక్.. గో బ్యాక్ అంటూ నిరసన -
అపవిత్ర పొత్తుకు తెరలేపిన టీడీపీ, జనసేన..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: బీజేపీ, జనసేన పొత్తు అనేది గతం. ఇప్పుడు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో బీజేపీని కాదని జనసేన అభ్యర్థులు నేరుగా తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకుంటున్నారు. ఏకంగా రెండు జెండాలను పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. వారు వేస్తున్న కరపత్రాలలో కూడా జనసేన మద్దతుతో అని వేయించుకుంటున్నారు. దీనిపై బీజేపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. పొత్తు ధర్మాన్ని జనసేన పాటించడం లేదని తమ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అనైతిక పొత్తులకు పాల్పడుతోందని విమర్శిస్తున్నాయి. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో నర్సాపురం, జంగారెడ్డిగూడెంలో నేరుగా జనసేన, తెలుగుదేశం పొత్తు కుదుర్చుకున్నాయి. ఏలూరులో తెలుగుదేశం అభ్యర్థులు విత్‌డ్రా అయిన చోట జనసేన అభ్యర్థులకు ప్రచారం చేస్తామని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నరసాపురంలో బహిరంగంగానే నరసాపురం మునిసిపాలిటీలో టీడీపీ, జనసేన బహిరంగంగా పొత్తులు పెట్టుకున్నాయి. పలు వార్డుల్లో ఉమ్మడిగా అభ్యర్థులను నిలబెట్టాయి. పట్టణంలో మొత్తం 31 వార్డులు ఉంటే వాటిలో మూడు వార్డులు వైఎస్సార్సీపీ ఏకగ్రీవం అయ్యాయి. ఇక 28 వార్డుల్లో పోటీ జరుగుతోంది. వీటిలో 19 వార్డుల్లో టీడీపీ పోటీ చేస్తుండగా, ఏడు వార్డుల్లో జనసేన అభ్యర్థులను పోటీలో నిలిపారు. 1, 2, 3, 4, 6, 7, 8, 9, 10, 11,12, 17, 18, 19, 20, 28, 29, 30, 31 వార్డుల్లో తెలుగుదేశం అభ్యర్థులు బరిలో నిలవగా, 13, 14, 15, 21, 22, 23, 26 వార్డుల్లో జనసేన పోటీలో నిలిచింది. టీడీపీ పోటీ చేసేచోట జనసేన అభ్యర్థులను నిలబెట్టలేదు. జనసేన బలంగా ఉన్నచోట తెలుగుదేశం అభ్యర్థులను నిలబెట్టలేదు. ఇక తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు జనసేన అభ్యర్థుల విజయం కోరుతూ, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బొమ్మిడి నాయకర్ తెలుగుదేశం అభ్యర్థుల విజయం కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. రెండు పార్టీల అభ్యర్థులు కరపత్రాలు, పోస్టర్లలో టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీ అభ్యర్థులుగా ముద్రించి బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ మాత్రం నాలుగు వార్డుల్లో పోటీలో అభ్యర్థులను నిలబెట్టి ఒంటరి పోరాటం చేస్తోంది. జంగారెడ్డిగూడెంలో కూడా అదేతీరు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా తెలుగుదేశం, జనసేన పార్టీలు అపవిత్ర పొత్తుకు తెరలేపాయి. పట్టణంలో జనసేన ఏడు వార్డుల్లో పోటీలో నిలిచింది. దీనిలో ఐదు వార్డుల్లో తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకోగా, ఈ ఐదు వార్డుల్లోనూ తెలుగుదేశం అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 4, 9, 11, 13, 16 వార్డుల్లో జనసేన టీడీపీతో పొత్తు కుదుర్చుకుని తమ అభ్యర్థులను పోటీలో ఉంచింది. 18, 29 వార్డుల్లో టీడీపీ, జనసేన పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి. పొత్తులో భాగంగా జనసేన పార్టీ తమ అభ్యర్థులను ఇక్కడ పోటీ నుంచి ఉపసంహరించుకోవాల్సి ఉండగా, పోటీలో నిలబెట్టాయి. దీంతో టీడీపీలో ఒక వర్గం గుర్రుగా ఉంది. ఇక బీజేపీ నాయకులు తమతో మిత్రపక్షంగా ఉన్న జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఏలూరు కార్పొరేషన్లో కూడా పలుచోట్ల తెలుగుదేశం అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. ఇక్కడ జనసేన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 2014లో తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన జనసేన 2019లో ఒంటరిపోరు చేసి చావుదెబ్బ తిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక నాయకత్వం లోపాయికారీ పొత్తులకు తెరలేపింది. చదవండి: చంద్రబాబు ఫ్లాప్ షో: టీడీపీలో నిరుత్సాహం ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య -
చంద్రబాబుది అనైతిక రాజకీయం
సీపీఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావు విజయనగరం క్రైం: ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కోసం ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చి కొనడం ద్వారా అనైతిక రాజకీయాలకు పాల్పడ్డారని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావు విమర్శించారు. చంద్రబాబు పాలన ఏడాది అయిన సందర్భంగా శుక్రవారం అమర్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బలంలేని తెలంగాణలో సైతం ఎమ్మెల్యేలను కొని ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు నీచస్థాయిలో దిగజారుడు రాజకీయాలకు నాంది పలికారన్నారు. ఎవరిని ఉద్ధరించేందుకు జూన్ 2న నవ నిర్మాణ దినోత్సవాన్ని జరిపారని ప్రశ్నించారు. 2014 ఎన్నికల సందర్భంగా, సెప్టెంబర్ 5న అసెంబ్లీలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, తోటపల్లి జలాశయాన్ని ఏడాదిలో పూర్తిచేయడం, మెగా అగ్రికల్చరల్ ఫుడ్‌పార్క్, గిరిజన విశ్వవిద్యాలయం, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్క్, పోర్ట్, మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమి, వైద్య కళాశాల, విజయనగరం స్పార్ట్ సిటీ హామీలిచ్చి కోతల రాయుడిగా నిలిచిపోయారని ఎద్దేవా చేశారు. వచ్చే ఏడాదిలోగా పది శాతం హామీలైనా అమలు చేయకపోతే భవిష్యత్తులో ఆయన్ను ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదన్నారు. చంద్రబాబు హామీల మేనిఫెస్టో పత్రాలను ఈ నెల 8న దహనం చేస్తామని తెలిపారు. సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, జిల్లా కార్యవర్గసభ్యులు బుగత సూరిబాబు, బాయి రమణమ్మ పాల్గొన్నారు.