జంగారెడ్డిగూడెంలో ప్రచార వాహనానికి తెలుగుదేశం, జనసేన జెండాలు-నర్సాపురంలో మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు జనసేన నేతలతో కలిసి ప్రచారం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: బీజేపీ, జనసేన పొత్తు అనేది గతం. ఇప్పుడు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో బీజేపీని కాదని జనసేన అభ్యర్థులు నేరుగా తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకుంటున్నారు. ఏకంగా రెండు జెండాలను పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. వారు వేస్తున్న కరపత్రాలలో కూడా జనసేన మద్దతుతో అని వేయించుకుంటున్నారు. దీనిపై బీజేపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. పొత్తు ధర్మాన్ని జనసేన పాటించడం లేదని తమ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అనైతిక పొత్తులకు పాల్పడుతోందని విమర్శిస్తున్నాయి. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో నర్సాపురం, జంగారెడ్డిగూడెంలో నేరుగా జనసేన, తెలుగుదేశం పొత్తు కుదుర్చుకున్నాయి. ఏలూరులో తెలుగుదేశం అభ్యర్థులు విత్‌డ్రా అయిన చోట జనసేన అభ్యర్థులకు ప్రచారం చేస్తామని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
నరసాపురంలో బహిరంగంగానే
నరసాపురం మునిసిపాలిటీలో టీడీపీ, జనసేన బహిరంగంగా పొత్తులు పెట్టుకున్నాయి. పలు వార్డుల్లో ఉమ్మడిగా అభ్యర్థులను నిలబెట్టాయి. పట్టణంలో మొత్తం 31 వార్డులు ఉంటే వాటిలో మూడు వార్డులు వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవం అయ్యాయి. ఇక 28 వార్డుల్లో పోటీ జరుగుతోంది. వీటిలో 19 వార్డుల్లో టీడీపీ పోటీ చేస్తుండగా, ఏడు వార్డుల్లో జనసేన అభ్యర్థులను పోటీలో నిలిపారు. 1, 2, 3, 4, 6, 7, 8, 9, 10, 11,12, 17, 18, 19, 20, 28, 29, 30, 31 వార్డుల్లో తెలుగుదేశం అభ్యర్థులు బరిలో నిలవగా, 13, 14, 15, 21, 22, 23, 26 వార్డుల్లో జనసేన పోటీలో నిలిచింది. టీడీపీ పోటీ చేసేచోట జనసేన అభ్యర్థులను నిలబెట్టలేదు. జనసేన బలంగా ఉన్నచోట తెలుగుదేశం అభ్యర్థులను నిలబెట్టలేదు. ఇక తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు జనసేన అభ్యర్థుల విజయం కోరుతూ, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మిడి నాయకర్ తెలుగుదేశం అభ్యర్థుల విజయం కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. రెండు పార్టీల అభ్యర్థులు కరపత్రాలు, పోస్టర్‌లలో టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీ అభ్యర్థులుగా ముద్రించి బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ మాత్రం నాలుగు వార్డుల్లో పోటీలో అభ్యర్థులను నిలబెట్టి ఒంటరి పోరాటం చేస్తోంది.
జంగారెడ్డిగూడెంలో కూడా అదేతీరు
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా తెలుగుదేశం, జనసేన పార్టీలు అపవిత్ర పొత్తుకు తెరలేపాయి. పట్టణంలో జనసేన ఏడు వార్డుల్లో పోటీలో నిలిచింది. దీనిలో ఐదు వార్డుల్లో తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకోగా, ఈ ఐదు వార్డుల్లోనూ తెలుగుదేశం అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 4, 9, 11, 13, 16 వార్డుల్లో జనసేన టీడీపీతో పొత్తు కుదుర్చుకుని తమ అభ్యర్థులను పోటీలో ఉంచింది. 18, 29 వార్డుల్లో టీడీపీ, జనసేన పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి. పొత్తులో భాగంగా జనసేన పార్టీ తమ అభ్యర్థులను ఇక్కడ పోటీ నుంచి ఉపసంహరించుకోవాల్సి ఉండగా, పోటీలో నిలబెట్టాయి. దీంతో టీడీపీలో ఒక వర్గం గుర్రుగా ఉంది. ఇక బీజేపీ నాయకులు తమతో మిత్రపక్షంగా ఉన్న జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఏలూరు కార్పొరేషన్‌లో కూడా పలుచోట్ల తెలుగుదేశం అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. ఇక్కడ జనసేన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 2014లో తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన జనసేన 2019లో ఒంటరిపోరు చేసి చావుదెబ్బ తిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక నాయకత్వం లోపాయికారీ పొత్తులకు తెరలేపింది.
చదవండి:
చంద్రబాబు ఫ్లాప్ షో: టీడీపీలో నిరుత్సాహం
ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య
Comments
Please login to add a commentAdd a comment