
సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొంది. భీమవరం టీడీపీ నేతలను పవన్ కళ్యాణ్ కలవకపోవడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో పవన్‌తో సమావేశం కోసం ఉదయం నుంచి టీడీపీ నాయకులు వేచి ఉన్నారు. కేవలం భీమవరం నియోజకవర్గ నాయకులతో అని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు సమావేశం ఏర్పాటు చేసింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో మాత్రమే భేటీ జరిగింది. పవన్ అర్థతరంగా వెళ్లిపోవడంతో టీడీపీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
భీమవరం టీడీపీ నాయకులతో పవన్ మీటింగ్ రద్దు అవడంపై మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.మమ్మల్నే కలవకపోతే ప్రజలని ఎలా కలుస్తారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వచ్చింది తెలుగుదేశం పార్టీని పాడు చేయడానికా.. అంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెప్పుడూ పవన్ మీటింగ్ అని భీమవరం పిలవద్దంటూ వీరవాసరం నాయకులు ధ్వజమెత్తారు. మండలాల వారీ మీటింగ్ పెట్టండి అంటూ సీరియస్ అయ్యారు. దీంతో పార్టీ నాయకులపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరెవరు ఎక్కడ మీటింగ్ పెట్టాలో చెప్పడానికి అంటూ పితాని మండిపడ్డారు.
ఇదీ చదవండి: చంద్రబాబుకి రెస్ట్.. కుప్పం బరిలో భువనేశ్వరి?