సాక్షి, భీమవరం: జనసేనాని పవన్ కల్యాణ్ భీమవరం బరిలోకి దిగేందుకు జంకుతున్నారా? గతంలో మాదిరి ఓటమి పాలైతే ఇక రాజకీయ భవిష్యత్ శూన్యమేనా? పోటీ చేసే విషయంలో పునరాలోచనలో పడ్డారా? మిత్రపక్షం టీడీపీ, తన కేడర్ మధ్య కుమ్ములాటలు, మరోపక్క ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ‘లోకల్’ చరిష్మా తనకు చేటు చేస్తాయని భావిస్తున్నారా? అంటే అవునన్న సమాధానాలే వస్తున్నాయి. ఇటీవల భీమవరంలో టీడీపీ, బీజేపీ నేతలను కలిసి వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేయడంతో పవన్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారన్న ప్రచారానికి బలం చేకూరింది. అయితే తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తన పేరు ప్రకటించుకోకపోవడంతో ఆ పార్టీ కేడర్ పూర్తి నైరాశ్యంలో పడిపోయింది.
గత ఎన్నికల్లో ఘోర ఓటమి
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా భీమవరం నుంచి పవన్ కల్యాణ్ పోటీలో నిలిచారు. జననేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనం, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ లోకల్ బలం ముందు పవన్‌కు ఘోర పరాజయం తప్పలేదు. 8,500 పైగా ఓట్లతో ఆయన పరాజయాన్ని చవిచూశారు. ఎన్నికల సమ యంలో భీమవరంలో మకాం ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చినా ఎన్నికల అనంతరం గత ఐదేళ్లలో రెండు, మూడుసార్లు తప్ప భీమవరం ప్రజలకు ఆయన దర్శన భాగ్యం కలగలేదు. దీంతో పార్టీ కేడర్ తీవ్ర అసంతృప్తిగా ఉంది. కొద్దినెలల క్రితం పవన్ భీమవరం వచ్చిన సందర్భంగా సొంత పార్టీ నేతలకే ఆయన్ని కలిసే అవకాశం దక్కలేదు. ‘పార్టీ కోసం లక్షలు ఖర్చుపెడుతున్న తమకే అధినేతను కలిసే భాగ్యం కలగలేదు. ఇంకా మీకెక్కడ’ అంటూ కొందరు నేతలను ఉద్దేశించి జనసేన పార్టీ వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్‌నాయుడు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారమే రేపాయి.
మద్దతు కోసం కలిసి.. మౌనంగా మారి..
రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది. టీడీపీలో గ్రూపు విభేదాలను చక్కదిద్ది వారి మద్దతు కూడగట్టుకునేందుకు రెండు రోజుల క్రితం భీమవరం పర్యటనకు ఆయన విచ్చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, బీజేపీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్ పాకా సత్యనారాయణ నివాసాలకు వెళ్లి స్వయంగా వారిని కలిసి మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్టు పవన్ ప్రకటించకపోయినా ఇక లాంఛనమే అని పార్టీ కేడర్ భావించింది. స్థానికంగా ఆయన ఉండేందుకు అనువైన ఇంటి కోసం ప్రయత్నిస్తున్నట్టు కూడా చర్చ జరిగింది.
ఐదేళ్ల అభివృద్ధి ఆందోళనతోనే..
శనివారం పవన్ విడుదల చేసిన జనసేన పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాలో తాను పోటీ చేసే స్థానం ప్రకటించకపోవడం పార్టీ కేడర్‌ను అయోమయానికి గురిచేస్తోంది. మిత్రపక్ష భాగస్వామి చంద్రబాబు కుప్పం నుంచి పోటీచేస్తున్నట్టు ప్రకటించగా భీమవరం నుంచి పోటీపై తమ అధినేత ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో కేడర్ అసంతృప్తికి లో నవుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల్లో నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, గ్రూపు రాజకీయాలు తనకు చేటు చేస్తాయన్న ఆందోళనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది.
దీనికితోడు తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా జిల్లాల పునర్విభజన సందర్భంగా భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కోరిన విషయాన్ని స్వయంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల భీమవరంలో జరిగిన జగనన్న విద్యాదీవెన బహిరంగ సభ వేదికగా వెల్లడించడం ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు నియోజకవర్గంలో మరింత జనాదరణ పెంచింది. ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్సార్‌సీపీని ప్రజలకు మరింత చేరువ చేశాయి. ఆయా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో 2019 ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయన్న ఆందోళనతో భీమవరం నుంచి పోటీచేసే విషయమై పవన్ కళ్యాణ్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment