టీవీ చూస్తున్నారా..పిల్లలూ జర జాగ్రత్త..
వాషింగ్టన్: మీ పిల్లలు రోజులో ఎక్కువ సేపు టీవీ చూస్తున్నారా? అయితే వారి ఆరోగ్యంపై మరికాస్త శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఎక్కువ సేపు టీవీ చూడడం లేదా కంప్యూటర్స్‌లో వీడియోగేమ్స్ ఆడే టీనేజ్ పిల్లల ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఎక్కువ సేపు ఎలక్ట్రానిక్ తెరల ముందు కూర్చోవడం టీనేజ్ పిల్లల ఎముకల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశంపై ఆర్కిటిక్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. టీనేజ్‌లో ఉన్న పిల్లలు ఎంతసేపు టీవీ చూడడం లేదా కంప్యూటర్ ముందు కూర్చోవడం చేస్తున్నారు అనే విషయాన్ని పరిశోధకులు విశ్లేషించారు.
ఇతర ఆరోగ్య అలవాట్లను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అనంతరం వెల్లడించిన అధ్యయన ఫలితాల ప్రకారం వారాంతాల్లో ఎక్కువ టీవీ చూసే వారి ఎముకల సాంద్రత తక్కువగా ఉంది. అయితే బాలల్లో మాత్రమే ఈ ఫలితం కనిపించింది. బాలికల్లోనూ మెడ ఎముక ప్రాంతంలో తక్కువ సాంద్రత కనిపించింది. అయితే బాలబాలికల్లో ఉండే హార్మోన్లు కూడా ఎముకల సాంద్రత విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు తెలిపారు.