నాటుతుపాకులతో సంచరిస్తే చర్యలు తప్పవు
శాలిగౌరారం:
మండలంలో వేటగాళ్ళు అక్రమంగా నాటు తుపాకులతో సంచరిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్ఐ శ్రీరాముల అయోధ్య హెచ్చరించారు. శనివారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ పల్లెల్లో వేటగాళ్లు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలను ధ్వంసం చేసే జంతువులు, పక్షుల బారినుంచి ఆయా పంటలను కాపాడుకునేందుకు వివిధ మండలాల్లో రైతులు సంబంధిత జిల్లా ఉన్నతాధికారుల నుంచి నాటు తుపాకుల వినియోగం అనుమతిని పొందారన్నారు. కానీ ఆయా వ్యక్తులు తమ పరిధిని దాటి ఇతర మండలాలలో నాటు తుపాకులతో జంతువులు, పక్షులను వేటాడటం చట్ట విరుద్ధమన్నారు. సంబంధిత నాటు తుపాకుల వినియోగదారులు ఏ ఉద్దేశం కోసం అధికారుల అనుమతిని పొందారే అంతవరకు మాత్రమే వినియోగించుకోవాలని చెప్పారు. తుపాకులతో వేటకు వెళితే స్థానిక పోలీస్స్టేషన్లో ఆనుమతి పత్రాన్ని సమర్పించాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.