తూర్పు వయా పశ్చిమ
జిల్లాలో ఎక్కడా గంజాయి సాగు లేదు. అయినా.. ప్రధాన దారుల్లో దాని ఘాటు గుప్పుమంటోంది. తూర్పు అటవీ ప్రాంతం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా టన్నుల కొద్దీ గంజాయి తరలిస్తున్నారు. ఇందుకోసం వ్యాన్లతోపాటు అత్యంత ఖరీదైన కార్లను సైతం వినియోగిస్తున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాలకూ ఎగుమతులు సాగుతున్నాయి. ఈ స్మగ్లర్ల మాఫియా పోలీస్ శాఖలోని కీలక అధికారులను సైతం వశం చేసుకుని దందా నడిపే స్థాయికి ఎదిగింది. తాజాగా.. బుధవారం దేవరపల్లి, గోపాలపురం సమీపంలోని జగన్నాథపురం వద్ద వెయ్యి కిలోలకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గంజాయి అక్రమ రవాణాకు మన జిల్లా కేంద్రంగా మారుతోంది. విశాఖపట్నంలోని ఏజెన్సీ గ్రామాల నుంచి నర్సీపట్నం కేంద్రంగా సాగుతున్న గంజాయి అక్రమ రవాణాలో కీలక పాత్రధారులు జిల్లాకు చెందిన వారు ఉండటంతో గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటుతోం ది. దేవరపల్లిలో బుధవారం 800 కిలోల గంజాయిని స్వాధీ నం చేసుకోగా.. గోపాలపురం మండలం జగన్నాథపురం వద్ద ప్రమాదానికి గురైన కారులో మరో 200 కేజీలు లభ్యమైంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి గాయపడ్డాడు. ఇటీవల కాలంలో కొవ్వూరు–గోపాలపురం మధ్య పోలీసులు తరచూ దాడులు నిర్వహించిన భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నా.. అక్రమ రవాణా ఆగటం లేదు.
హైదరాబాద్, మహారాష్ట్ర వరకూ..
విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని అటవీ ప్రాం తాల్లో గంజాయి సాగు పెద్దఎత్తున జరుగుతోంది. విశాఖలో పండించిన గంజాయిని నర్సీపట్నం కేంద్రంగా.. తూర్పు గోదావరి జిల్లా చింతూరు, డొంకరాయి అటవీ ప్రాంతాల్లో పండించిన గంజా యిని అక్కడి నుంచి నేరుగా రవాణా చేస్తున్నారు. ఇందుకోసం మన జిల్లా మీదుగా ప్రత్యేకమైన రూట్లను స్మగ్లర్లు ఎంచుకుంటున్నారు. దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మీదుగా కొందరు.. దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకా తిరుమల, కామవరపుకోట, చింతలపూడి మీదుగా మరికొందరు సరుకును రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. ఇందుకు జిల్లాలోని వ్యక్తులతోపాటు కొందరు పోలీసులు సైతం సహకరిస్తున్నట్టు తెలు స్తోంది. ఇటీవల గంజాయి రవాణా వ్యవహారంలో తలదూర్చిన చింతలపూడి సీఐ జి.దాస్‌పై సస్పెన్షన్ వేటు పడిన విషయం విదితమే. ఫిబ్రవరి 21న గంజాయి లారీని పోలీసులు స్వాధీనం చేసుకోగా.. ప్రధాన నిందితుడిని వదిలేసేందుకు సీఐ రూ.4 లక్షలు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు ప్రధాన నిందితుడు ప్రతినెలా, ప్రతి లోడుకు కొంత నగదు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ వ్యవహారం బయటపడటంతో సీఐపై వేటు పడింది. గతనెల 12న దేవరపల్లి వద్ద వ్యాన్‌లో మామిడికాయల మాటున తరలిస్తున్న 330 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్మగ్లింగ్‌లోనూ జిల్లా వాసులు
నాలుగు రోజుల క్రితం విశాఖపట్నంలో అంతర్ రాష్ట్ర గంజాయి వ్యాపారి గుట్టును కశింకోట పోలీసులు రట్టు చేశారు. నలుగురు సభ్యులున్న ముఠాను శనివారం అరెస్ట్ చేసి వారినుంచి 504 కిలోల గంజాయి, మూడు దేశీయ పిస్తోళ్లు, వ్యాన్, కారు, మోటార్ సైకిల్, రూ.17,500 నగదు, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు విశాఖ ఏజెన్సీలో కొనుగోలు చేసిన గంజాయిని ప్యాకెట్ల రూపంలో గోనె సంచుల్లో నింపి ఇతర రాష్ట్రాలకు వ్యాన్లు, కార్లలో తరలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం శిరగాలపలి్లకి చెందిన శ్రీనివాసరావు అలియాస్ బాబా, విశాఖ జిల్లాకు చెందిన కొందరిని కలుపుకుని స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. శ్రీనివాసరావు పదేళ్లగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. స్వగ్రామంలో తొలుత కట్టెల వ్యాపారం చేసేవాడు. లాభదాయకంగా ఉండటంతో గంజాయి స్మగ్లింగ్ బాట పట్టాడు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని శ్రీని వాసనగర్‌లో ఉంటూ.. కొంతమందితో ముఠా కట్టి విశాఖ ఏజెన్సీ నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు పెద్దఎత్తున రవాణా చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. కూడబెట్టిన సంపాదనతో రాజమండ్రిలో ఒక ప్లాట్, తన గ్రామంలో ఎకరం భూమి, ఇల్లు కొనుగోలు చేసి విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. జిల్లాలోని దేవరపల్లి, తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీసు స్టేషన్లలోనూ ఇతనిపై గంజాయి రవాణా కేసులున్నాయి. ప్రత్యర్థి ముఠాలతో విభేదాలున్న నేపథ్యంలో అతడు ఆయుధాలు కూడా కొనుగోలు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. తాజాగా దేవరపల్లిలో పోలీసులకు 800 కిలోల గంజాయి పట్టుబడింది. గోపాలపురం వద్ద కారు ప్రమాదానికి గురికాగా, అందులో రవాణా చేస్తున్న గంజాయి కూడా బయటపడింది. ఆ కారులో వేర్వేరు నంబర్ ప్లేట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కారు ప్రమాదానికి గురి కాకపోతే ఈ గంజాయి గమ్యస్థానానికి సురక్షితంగా చేరేదే. ఒకేరోజున పెద్దఎత్తున గంజాయి పట్టుబడటంతో, రోజూ ఎంత మొత్తంలో తరలి వెళుతోందోనన్న ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి.