41 ఏళ్ల తర్వాత కన్నతల్లి చెంతకు!
ముంబై: భారత సంతతికి చెందిన నీలాక్షి ఎలిజబెత్ జోరెండాల్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. నాలుగు దశాబ్దాల (41 ఏళ్ల) తర్వాత తన కన్నతల్లిని కలుసుకోవడమే అందుకు కారణం. ఆ వివరాలు.. మహారాష్ట్రకు చెందిన యవాత్మల్ 1973లో తన భర్త చనిపోయే సమయానికి గర్భవతిగా ఉంది. వ్యవసాయ కూలీ అయిన యవాత్మల్ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఏడాది ఆమె ఓ పండంటి పాప నీలాక్షికి జన్మనిచ్చింది. ఆ పాపకు మూడేళ్ల వయసు ఉండగా తల్లి ఆమెను పుణే సమీపంలోని కెడ్గావ్‌లో ఉన్న పండిత రమాబాయి ముక్తి మిషన్ అనాథశ్రమంలో వదిలి వెళ్లింది. అదే సమయంలో స్వీడన్‌కు చెందిన ఓ జంట ఆ పాపను దత్తత తీసుకుంది.
ఎలిజబెత్ తల్లి రెండో వివాహం చేసుకోగా ఆమెకు ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. 1976లో దత్తత పెరేంట్స్‌తో స్వీడన్ వెళ్లిన ఎలిజబెత్‌కు 1990లో కన్నతల్లి గురించి చెప్పారు. అదే ఏడాది 17 ఏళ్ల వయసులో తొలిసారిగా ఎలిజబెత్ పుణే వచ్చి తల్లి యవాత్మల్ గురించి వాకబు చెసింది. కానీ ప్రయోజనం లేదు. అలా గతేడాది వరకు ఐదు పర్యాయలు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి పుణేకు చెందిన ఎన్జీఓ సాయంతో ఆమె తన తల్లిని కలుసుకున్నారని ఆరో ప్రయత్నంలో ఎలిజబెత్ సాధించారని సంస్థ సిబ్బంది అంజలీ పవార్ తెలిపారు.
గత శనివారం ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో తన తల్లి యవాత్మల్ ను చూడగానే ఎలిజబెత్ కన్నీటి పర్యంతమయ్యారు. 41 ఏళ్ల తర్వాత తల్లి చెంతకు చేరానన్న ఆనందలో మొదట ఆమె నోటివెంట మాట రాలేదు. 27 ఏళ్ల తన నిరీక్షణకు తెరపడిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. తల్లి ఆరోగ్యానికి బాగు చేయించడానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని, తమ్ముడు, చెల్లిని కూడా సంరక్షిస్తానని చెప్పారు. తనకు సాయం చేసిన ఎన్జీవోకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.