'ఛానల్స్ నిలిపివేతపై సర్కార్‌కి సంబంధం లేదు'
హైదరాబాద్ : హైదరాబాద్‌ను సాంకేతిక నగరంగా అభివృద్ధి చేస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గురువారం ఆయన హైటెక్స్‌లో ఇండియా గాడ్జెట్ ఎక్స్పోను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌ను హార్డ్‌వేర్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఇప్పటికే ఇన్క్యూబేషన్ సెంటర్‌ను ప్రారంభించామన్నారు. ఇన్క్యూబేషన్ సెంటర్ల ద్వారా యువ పారిశ్రామకవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు.
సాప్ట్వేర్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేటీఆర్ తెలిపారు. ఆరు నుంచి ఎనిమిది నెలల్లో హార్డ్‌వేర్‌కు సంబంధించి కొత్త పాలసీ తీసుకు రానున్నట్లు ఆయన తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం చిన్న కంపెలకు ప్రోత్సహం ఇచ్చేందుకు ప్రత్యేకమైన విధానం రూపొందిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా టీవీ 9, ఆంధ్రజ్యోతి ఛానల్స్ ప్రసారాల నిలుపుదలపై కేటీఆర్ స్పందించారు. కేబుల్ ఆపరేటర్ల నిర్ణయానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. ఎంఎస్‌వోలతో సదరు టీవీ ఛానల్స్ చర్చించుకోవాలని కేటీఆర్ సూచించారు.