కాల్ కేటుగాళ్లు
► కాల్ డైవర్షన్ రాకెట్ గుట్టురట్టు!
► అంతర్జాతీయ ఇన్కమింగ్ కాల్స్ లోకల్‌గా మార్పు
► సూత్రధారులు విదేశాల్లో, హైటెక్ పద్దతిలో వ్యవహారం
► ఏజెన్సీల నిఘాకు చిక్కకుండా ఫోన్లు చేసేందుకు ఆస్కారం
► హబీబ్‌నగర్‌లో సైబర్ క్రైమ్ కాప్స్ దాడి, అదుపులో నిందితులు
హైదరాబాద్:
విదేశాల నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్ పైనా ఏజెన్సీల నిఘా ఉంటుంది. అనునుమానాస్పద దేశాలు, వ్యక్తులు, నెంబర్ల నుంచి వచ్చే వాటిని ట్యాప్ కూడా చేస్తారు. ఇందుకు ఉపకరించే సాధనాలు దేశం లోని నాలుగు ప్రధాన నగరాల్లో ఉన్న ఇండియన్ ఇంటర్నేషనల్ గేట్‌వే ఐఎల్‌డీ ఆపరేటర్లకు ఉంటుంది. వారికి చిక్కకుండా హైటెక్ పద్దతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ను వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పద్దతిలో లోకల్ కాల్స్‌గా మారుస్తున్న హైటెక్ ముఠాగుట్టును సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు గుట్టురట్టు చేశారు. అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌ను ఈ రకంగా మార్చడం ద్వారా ప్రభుత్వానికీ పన్ను రూపంలో రావాల్సిన కోట్ల ఆదాయానికి గండి పడుతోంది.
విదేశాల నుంచి ఓ వ్యక్తి చేసే ఫోన్ కాల్ అక్కడి ఎక్సేంజి నుంచి నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్‌కు చేరతాయి. అక్కడ నుంచి ఇంటర్నేషనల్ గేట్ వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చి అక్కడ నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేదా శాటిలైట్ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇక్కడకు చేరిన ఫోన్‌కాల్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్న ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌ల ద్వారా ఇక్కడ కాల్ రిసీవ్ చేసుకునే ఫోన్‌కు వస్తుంది.
ఈ తతంగం అంతా సెకను కంటే తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌లకు సైతం విదేశీ కాల్ ఆపరేటర్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకునే వీరు తమ ఆదాయం నుంచి నిర్ణీత మొత్తాన్ని పన్నురూపంలో చెల్లిస్తారు. అయితే విదేశీ ఆపరేటర్లు ఇక్కడి వారికి డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపకరించేలా ఓ విధానాన్ని రూపొందించారు. స్థానికులు కొందరికి ఇంటర్నెట్ ద్వారా ఎరవేసి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేలా చేస్తారు. వాటి ద్వారా విదేశాల్లోని ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చిన ఫోన్ కాల్ అక్కడ డేటాగా మారిపోతుంది.
దాన్ని ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఇక్కడి వారితో ఏర్పాటు చేయించిన అత్యాధునిక పరికరాలకు పంపిస్తారు. వీరి దగ్గర ఉండేగేట్వేలు ఈ డేటాను మళ్లీ కాల్‌గా మారుస్తాయి. వాటిని అనుసంధానించి ఉన్న సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలకు చేరుతుంది. స్థానికంగా (లోకల్) బోగస్ వివరాలతో తీసుకున్న ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డులను సేకరించి ఈ సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలను తయారు చేస్తారు. గేట్‌వే నుంచి వీటికి వెళ్లిన అంతర్జాతీయ కాల్ లోకల్‌గా మారిపోయి ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డునకు చెందిన నెంబరు (లోకల్) నుంచి వస్తున్నట్లు ఆ ఫోన్ అందుకునే వారికి కనిపిస్తుంది. దీని వల్ల విదేశాల్లో ఉండే వ్యక్తికి సైతం కాల్ఛార్జి తగ్గుతుంది. దీంతో దేశంలోని పలువురు ఆపరేటర్లకు రావాల్సిన ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన పన్నులకు గండిపడుతోంది. దేశంలోని సర్వీసు ప్రొవైడర్ల ఆదాయానికి గండి కొట్టడం ద్వారా విదేశీ సర్వీసు ప్రొవైడర్ ఆ మొత్తాన్నీ మిగుల్చుకుంటున్నాడు. ఇక్కడ అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసి సహకరించిన స్థానికులు హవాలా రూపంలో కమీషన్ పంపిస్తుంది.
నగరానికి చెందిని ఓ మహిళకు ఇటీవల ఓ నెంబర్ నుంచి అభ్యంతర, అశ్లీల సందేశాలు వస్తుండటంతో ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎంతగా ప్రయత్నించినా ఆ నెంబర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రాలేదు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు ఇంటర్నెట్ ఆధారిత నెంబర్‌గా, వీఓఐపీ పరిజ్ఞానంతో పని చేస్తున్నట్లు గుర్తించారు. సదరు ఇంటర్నెట్ ఆపరేటర్‌ను సంప్రదించిన పోలీసులు హబీబ్‌నగర్ ప్రాంతంలో దాదాపు 60 కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. తొలుత పోలీసులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిందితుల తరఫు వారు దాదాపు గంట సేపు అడ్డుకున్నారు దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు, స్థానిక పోలీసులతో పాటు బస్తీ పెద్దల సహకారంతో ఇంట్లోకి ప్రవేశించి ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు భారీ ఉపకరణాలు, ఆరు ఎయిర్‌గన్స్, 10 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆ ఆయుధాలు తమ ఫామ్‌హౌస్‌లో వినియోగించేవిగా నిందితులు వెల్లడించారు.
వీరు నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ డైవర్షన్ కేంద్రాలు (అక్రమ ఎక్సేంజ్‌లు) ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేంద్రనగర్ సహా మిగిలిన ప్రాంతాల్లోని వాటిని గుర్తించడంతో పాటు మిగిలిన నిందితుల్ని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో కొన్ని ఎయిర్‌గన్స్ ఉన్నాయి. వీటికి లైసెన్స్ అవసరం లేదు. మరికొన్ని అత్యాధునిక హంటింగ్ గన్స్‌గా గుర్తించాం. వీటికి లైసెన్స్ అవసరమా? లేదా? అనేది పరిశీలిస్తున్నాం. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం’ అని అన్నారు.