కొబెల్కో కొత్త మైనింగ్ ఎక్స్కవేటర్లు
శ్రీసిటీలో ఉత్పత్తి ప్రారంభం
వరదయ్యపాళెం(సత్యవేడు): మైనింగ్ రంగం కోసం అధునాతన ఎక్స్కవేటర్లను శ్రీసిటీలోని కొబెల్కో ఇండియా సంస్థ ప్రవేశపెట్టింది. 20–24 టన్నుల సామర్థ్యం గల జనరేషన్ 10 వండర్ ఎస్కె–220 ఎక్స్డి, ఎస్కె–220 ఎక్స్డిఎల్సి మోడల్ 20 నుంచి 24 టన్నుల సామర్థ్యం గల ఎక్స్కవేటర్లను గురువారం శ్రీసిటీలోని కొబెల్కో ప్లాంట్లో సంస్థ ఎండీ యుకోటో గోటో, చీఫ్ అడ్వైజర్ విక్రమ్ శర్మ, శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నా రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మొదటి యంత్రాన్ని కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత కె.నరసింహారెడ్డికి తాళం చెవి అందజేసి వాహనాన్ని అప్పగించారు.
అత్యంత కష్టతరమైన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపేందుకు జనరేషన్ 10 ఎక్స్కవేటర్లు ఎంతో ఉపయోగకరమని యుకోటో గోటో చెప్పారు. 19శాతం వరకు ఇంధన పొదుపు, 19 శాతం వరకు అధిక ఉత్పత్తి సాధ్యమవుతుందన్నారు. ఛీప్ అడ్వైజర్ విక్రమ్ శర్మ మాట్లాడుతూ కొబెల్కో పరిశ్రమ ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తి కావస్తున్న తరుణంలో ఈ కొత్త ఎక్స్కవేటర్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఆటోమొబైల్ రంగంలో నిర్మాణ రంగ సంస్థలకు సంబంధించి అతి పెద్ద యంత్రాలు శ్రీసిటీ కొబెల్కోలో ఉత్పత్తి కావడం అభినందనీయమని ఈ సందర్భంగా శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి పేర్కొన్నారు.