జాతీయ క్రీడా బిల్లుకు కోర్టు మద్దతు
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా బిల్లుపై కోర్టుకెక్కిన భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు నిరాశే ఎదురైంది. దేశంలోని క్రీడా సమాఖ్యలన్నీ స్పోర్ట్స్ కోడ్ నిబంధనలు పాటించాల్సిందేననే ఆదేశాలను ఐఓఏ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. అయితే ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, నజ్మీ వజిరిలతో కూడిన బెంచ్ తిరస్కరించింది. పాలనలో పారదర్శకత్వం పాటించడంతో పాటు ఆఫీస్ బేరర్లకు గరిష్ట వయసు పరిమితి, పదవీ కాలంపై ఆంక్షలను స్పోర్ట్స్ కోడ్‌లో పొందుపరిచారు. వీటిని ఐఓఏ గతం నుంచే వ్యతిరేకిస్తోంది. ఆఫీస్ బేరర్ల వయస్సు పరిమితి ఈ కోడ్ కారణంగా 70 ఏళ్లకు మించరాదు.
స్పోర్ట్స్ కోడ్‌కు అనుకూలంగా ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర క్రీడల మాజీ మంత్రి అజయ్ మాకెన్ స్వాగతించారు. దేశంలో క్రీడాభివృద్ధిపై తన చిత్తశుద్ధి రుజువైందని ఆయన చెప్పారు. ఈ కోడ్ ద్వారా సమాఖ్యలో ఎన్నికలు సజావుగా జరుగుతాయని తెలిపారు. ఆయన హయాంలోనే 2011లో ఈ బిల్లుకు రూపకల్పన జరిగింది.