స్థిరాస్తి కొనుగోళ్లలో.. ముంబై ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్!
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్‌లో స్థిరాస్తి ధరలు తక్కువగా ఉన్నాయని స్థిరాస్తి నిపుణులు చెబుతుంటారు. అలా చూస్తే ఇక్కడే కొనుగోళ్లు ఎక్కువగా ఉండాలి మరి. కానీ, ఇండియా ప్రాపర్టీ. కామ్ ఇటీవల నిర్వహించిన సర్వేలో భిన్నమైన గణాంకాలొచ్చాయి.
ముంబై, బెంగళూరు, చెన్నై, పుణే, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ఇండియా ప్రాపర్టీ డాట్ కామ్ 25-35 ఏళ్లు, అలాగే 46 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న 2,583 మందిపై సర్వే చేసింది.
18 శాతం మంది షేర్ మార్కెట్లలో, 15 శాతం మంది బంగారంపై పెట్టుబడులకు మొగ్గుచూపుతుండగా.. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు 67 శాతం మంది భారతీయులు ఇష్టపడుతున్నారని సర్వేలో తేలింది.
కొనుగోళ్ల ఎక్కడనే అంశంపై.. 30 శాతం మంది ముంబై శ్రేయస్కరమని భావించి.. మొదటి స్థానంలో నిలపారు. ఆ తర్వాత బెంగళూరు 21 శాతం, ఢిల్లీ 15 శాతం, చెన్నై 12 శాతం, పుణే 9 శాతం, కోల్క తా 7 శాతంతో వరుస స్థానాల్లో నిలివగా.. కేవలం 6 శాతం మంది మాత్రమే హైదరాబాద్‌ను ఎంచుకున్నారు.
పెట్టుబడులకు సరైన సమయమేది అనే అంశంపై.. 49 శాతం మంది వేచి చూసే ధోరణిలో ఉండగా.. 35 శాతం మంది ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. 16 శాతం మంది సందిగ్ధంలో ఉన్నారని సర్వే వెల్లడించింది.
ధరల పెరుగుదల అంశంపై.. రెండేళ్లలో 62 శాతం మంది ధరలు పెరుగుతాయని భావిస్తే.. 38 శాతం మంది కేంద్ర ప్రభుత్వంపై ఆశతో ఉన్నారు. మెరుగైన మౌలిక వసతులను కల్పించటంతో పాటు, గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గిస్తుంద న్నారు.
ఎందులో పెట్టుబడి శ్రే యస్కరమనే అంశంపై.. 40 శాతం మంది ఫ్లాట్లలో పెట్టుబడికి మొగ్గుచూపితే.. 24 శాతం మంది ఇండివిడ్యువల్ బంగ్లాల్లో, 23 శాతం మంది స్థలాలపై, కేవలం 7 శాతం మాత్రమే వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడులకు ఇష్టపడుతున్నట్లు సర్వే వెల్లడించింది.