ఐసీసీ సంచలన నిర్ణయం
- భారత్- దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ రీకాల్
దుబాయ్: ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో శివసేన కార్యకర్తలు సృష్టించిన రచ్చ.. దుబాయ్ లోని ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్)ని కూడా కుదిపేసింది. దాయాది పాకిస్థాన్ తో సిరీస్ వద్దంటూ సోమవారం ఉదయం శివసేన కార్యకర్తలు బీసీసీఐ కార్యాలయాన్ని ముట్టడించడం, అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఛాంబర్లోకి చొరబడి రచ్చచేసిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ ను వెనక్కి పిలిపిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
ప్రస్తుతం భారత్- దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతోన్న గాంధీ- మండేలా సిరీస్ కు అంపైర్లుగా వ్యవహరిస్తున్నవారిలో అలీమ్ దార్ ఒకరు. బీసీసీఐ కార్యాలయంలో చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలోనే అలీమ్ దార్ ను ఈ సిరీస్ నుంచి వెనక్కి పిలిపిస్తున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. దార్.. ముంబైలో జరగనున్న ఐదో వన్ డేలో ఫీల్డ్ అంపైర్ గా విధులు నిర్వర్తించాల్సిఉంది. చరిత్రలో మొట్టమొదటిసారిగా నేతల పేర్లతో జరుగుతున్న ఈ సిరీస్ లో విద్వేషాల కారణంగా ఇలాంటి పరిణామం బాధాకరమని పలువురు క్రీడాభిమానులను వాపోతున్నారు.