భారత్ అవకాశాల గని
- పెట్టుబడులకు ఇదే సరైన సమయం
- స్పానిష్ కంపెనీల సీఈవోలతో ప్రధాని మోదీ
- భారత్–స్పెయిన్ మధ్య ఏడు ఒప్పందాలు
మాడ్రిడ్: ఉగ్రవాదంపై పోరాటంతోపాటు వివిధ రంగాల్లో భారత్–స్పెయిన్ పరస్పర సహకారంతో ముందుకెళ్లనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్‌లో విస్తరించేందుకు స్పెయిన్ కంపెనీలకు అపార అవకాశాలున్నందున పెట్టుబడులతో ముందుకు రావాలని కోరారు. బుధవారం స్పెయిన్ అధ్యక్షుడు మారియానో రజోయ్‌తో ప్రధాని విస్తృత చర్చలు జరిపారు. ‘ఇరుదేశాలకు ఉగ్రవాదం ఓ సవాల్. అందుకే దీనిపై పోరులో కలిసి ముందడుగేస్తాం’ అని వెల్లడించారు. అంతర్జాతీయ మార్పుల్లో స్పెయిన్ కీలకపాత్ర పోషించనుందని అభిప్రాయపడ్డారు.
రజోయ్ నేతృత్వంలో స్పెయిన్ ఆర్థిక సంస్కరణలు చేపట్టిందని.. భారత్‌లోనూ తన ప్రభుత్వం ఇలాంటి సంస్కరణలే తీసుకొస్తోందని తెలిపారు. అటు విదేశీ కంపెనీల ఏర్పాటుకు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తున్న భారత ప్రభుత్వ చొరవను రజోయ్ స్వాగతించారు. ‘ఉగ్రవాదం అంతర్జాతీయ శాంతి సుస్థిరతకు పెను సవాల్‌గా మారిందని, దీన్ని పీచమణచేందుకు సంయుక్తంగా పనిచేయాలని రజోయ్, మోదీ నిర్ణయించారు’ అని వీరి సమావేశం అనంతరం వెలువడిన ప్రకటన పేర్కొంది. అనతరం ఇరు దేశాల మధ్య 7 ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. శిక్షపడ్డ ఖైదీల పరస్పర మార్పిడి, దౌత్యపరమైన పాస్‌పోర్టు ఉన్న వారికి వీసా రద్దు, అవయవ మార్పిడి, సైబర్ సెక్యూరిటీ, పునరుత్పాదక శక్తి, పౌరవిమానయాన, దౌత్య సేవల రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి. తర్వాత స్పెయిన్ రాజు ఫిలిప్ 6ను మోదీ కలసి కాసేపు మాట్లాడారు.
పెట్టుబడులతో రండి!
స్పెయిన్‌లోని ప్రముఖ కంపెనీల సీఈవోలతో సమావేశమైన మోదీ భారత్‌లోని అపారమైన ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. భారత్‌లో స్పెయిన్ పెట్టుబడులకు ఇది మంచి తరుణమన్నారు. భారత్ తన ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సహా పలు ఆర్థిక సంస్కరణలను వివరించారు. ‘స్పెయిన్ కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప పేరుంది. మౌలికవసతులు, రక్షణ, పర్యాటకం, విద్యుత్ రంగాలను మా ప్రభుత్వం ప్రాధాన్యంగా గుర్తించింది’ అని తెలిపారు. ‘మా ప్రభుత్వ ప్రముఖ పథకం మేకిన్ ఇండియాకు రక్షణ రంగంలో స్పెయిన్ అనుభం, రవాణా రంగంలో మౌలిక వసతులకు హైస్పీడ్ రైళ్లు, నీరు, చెత్త నిర్వహణ సాంకేతికత వంటి చాలా అంశాల్లో అవకాశాలున్నాయి’ అని మోదీ తెలిపారు. విదేశీ కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు తను చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. అంతకుముందు స్పానిష్ దినపత్రిక ‘ఎక్స్పాన్షన్’కు ఇంటర్వూ్య ఇచ్చిన మోదీ.. బలమైన ఆర్థికాభివృద్ధితో దూసుకుపోతున్న భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు స్పెయిన్ కంపెనీలకు ఇది కీలమైన సమయమని తెలిపారు. కాగా, 1992 తర్వాత (పీవీ నరసింహారావు) స్పెయిన్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీయే. స్పెయిన్ పర్యటన ముగిశాక మోదీ రష్యా పర్యటన కోసం సెయింట్‌పీటర్స్‌బర్గ్ చేరుకున్నారు.