ఇష్టంగా చదివితే ఏదీ కష్టం కాదు
సాక్షి, హైదరాబాద్: చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు.. దేశంలో ఎంతో క్లిష్టమైన చదువుల్లో వాటి లో ఒకటిగా భావించే కోర్సు. ఈ కోర్సులో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుందని చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ, సీఏ విజ యవంతంగా పూర్తిచేసినవారికి అద్భుతమైన కెరీర్ ఆహ్వనం పలుకుతుంది. ఇంత ప్రాధాన్యం ఉన్న కోర్సులో చేరి 22 ఏళ్ల వయసులోనే దానిని పూర్తి చేయటమే కాకుండా.. ఈ నెల 26న ఐసీఏఐ విడుదల చేసిన ‘ఫైనల్’ఫలితాల్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు.. పలమనేరుకు చెందిన రిషబ్ ఓస్వాల్. తన విజయానికి హార్డ్ వర్క్, ప్లానింగే కీలకంగా నిలిచాయని చెబుతున్న రిషబ్ ఓస్వాల్ సక్సెస్ స్టోరీ అతని మాటల్లోనే... రాజస్తాన్ నుంచి పలమనేరుకు.. రాజస్తాన్‌కు చెందిన మా కుటుంబం.. వృత్తి రీత్యా చిత్తూరు జిల్లాలోని పలమనేరులో స్థిరపడింది. నాన్న రాజేశ్ ఓస్వాల్ బంగారం, ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. నా స్కూల్ చదువు పలమనేరులోని ఎమ్మాస్ స్విస్ స్కూల్లోనే సాగింది. 2018లో ఐసీఎస్ఈ పదో తరగతిలో 97.5 శాతం మార్కులతో పాసయ్యాను. ఆ తర్వాత సీఏ కోర్సు అభ్యసించడానికి గుంటూరులోని మాస్టర్‌మైండ్స్ అకాడమీలో చేరాను. 2020లో ఇంటర్లో 96.8% మార్కులతో ఉత్తీర్ణత సాధించాను సీఏ దిశగా ఇలా..ఇంటర్మీడియెట్ పూర్తవగానే 2020లో సీఏ కోర్సులో చేరాను. 2021లో సీఏ ఇంటర్మిడియట్‌లో జాతీయ స్థాయిలో ఎనిమిదో ర్యాంకు సాధించాను. ఆ తర్వాత ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ కేపీఎంజీలో ఆర్టీకల్íÙప్ పూర్తి చేశాను. ఒకవైపు ఆర్టీకల్ షిప్ చేస్తూనే సీఏ ఫైనల్ పరీక్షలకు ప్రిపేరయ్యాను. గత నవంబర్‌లో పరీక్షలకు హాజరయ్యాను. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. సీఏంఏ కూడా.. సీఏ కోర్సు కంటే ముందు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సులో చేరి.. 2020లోనే సీఎంఏ ఫౌండేషన్‌లో, 2021లో సీఎంఏ ఇంటర్మీడియట్లో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సొంతం చేసుకున్నాను. అయితే సీఏనే నా లక్ష్యం కావటంతో 2021 నుంచి పూర్తిగా సీఏపైనే దృష్టి పెట్టాను. డైలీ ప్లానింగ్సీఏ కోర్సులో రాణించడానికి ప్రతి రోజూ దాదాపు 10 గంటలు చదివాను. పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి రోజుకు 12 గంటలు.. చివరి 15 రోజులు రోజుకు 14 నుంచి 15 గంటలు కష్టపడ్డాను. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదవడం, ప్రాక్టీస్ టెస్ట్స్‌కు హాజరవడం కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చాయి.‘సాక్షి’ స్పెల్–బి మెడల్ స్కూల్లో చదివేటప్పుడు కోకరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొన్నాను. ఈ క్రమంలో 2016లో ‘సాక్షి’స్పెల్–బి ఫైనల్స్‌కు చేరుకుని మెడల్ కూడా సాధించాను. దీంతోపాటు వీఐటీ స్పెల్–బిలోనూ రెండో ర్యాంకు సాధించాను.