ప్రతి నలుగురిలో ఒకరికి ఆస్తమా!
బెంగళూరు : రాష్ట్రంలోని ప్రతి నలుగురి పిల్లల్లో ఒకరు ఆస్తమాతో బాధపడుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్ డెరైక్టర్, శ్వాసకోశ వైద్య నిపుణుడు డాక్టర్ హెచ్.పరమేష్ తెలిపారు. సరైన మందులు తీసుకోక పోవడం వల్ల ఆస్తమాకు గురైన పిల్లల్లో దాదాపు రెండు శాతం మంది మరణిస్తున్నట్లు చెప్పారు. వరల్డ్ ఆస్తమా డేని పురస్కరించుకుని బ్రీత్ఫ్రీ స్వచ్చంద సంస్థ బెంగళూరులో గురువారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామీణ పిల్లలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోని పిల్లల్లో ఆస్తమా ఎక్కువగా ఉన్నట్లు తేలిందని చెప్పారు.
మారిన జీవన విధానంతో పాటు పర్యావరణ కాలుష్యం ఎక్కువ కావడమే ఇందుకు ారణమని పరిశోధనల్లో తేలిందని తెలిపారు. బాలికలతో పోలిస్తే బాలురుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటోందన్నారు. ఇంట్లో మస్కిటో కాయిల్స్ ఉపయోగించే వ్యక్తుల్లో ఆస్తమా రావడానికి ఎక్కువ అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక పెద్దల విషయం తీసుకుంటే మొత్తం జనాభాల్లో 8 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారనితెలిపారు. ఆస్తమా వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి ఎన్నో మందులు అందుబాటులో ఉన్నా కొన్ని మూఢ నమ్మకాలతో పాటు, స్నేహితులు, బంధువుల్లో చులకన అవుతామేమో అన్న భావనతో చాలా మంది వీటిని వాడకుండా ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన మొతాదులో ఇన్హెలర్స్ను తీసుకోవడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చునని పరమేశ్వర్ తెలిపారు. సదస్సులో ఫోర్టిస్ ఆసుపత్రి ప్రతినిధి, డాక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.