భారీ ఎయిర్పోర్ట్ అక్కర్లేదు
ప్రధానికి విమాన ప్రయాణికుల సంఘం లేఖ
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుకు కోట్లాది రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదని భారత విమాన ప్రయాణికుల సంఘం పునరుద్ఘాటించింది. రైతుల్ని రోడ్డున పడేసి అవసరానికి మించి విమానాశ్రయం నిర్మించాలనుకోవడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షుడు డి.వరదారెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్సాహం వల్ల విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తొలగించే కుట్రలు జరుగుతున్నాయని, అదే సమయంలో భోగాపురంలో రైతుల నుంచి వేల ఎకరాల భూములు లాక్కుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
ఇప్పటికే విశాఖ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారని, ఇరువైపులా మరో 150 మీటర్ల మేర విస్తరించాలని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆదేశాలొచ్చాయన్నారు. అందువల్ల విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రయాణికుల అవసరాలకు సరిపోయేలా భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తే చాలన్నారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కంటే పెద్దిగా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.