రాజ్యాంగం తల్లితో సమానం
సుప్రీం కోర్టు న్యాయమూర్తి
గోపాలగౌడు
అట్టహాసంగా ఐలు
రాష్ట్ర 10వ మహాసభలు ప్రారంభం
కర్నూలు(లీగల్): భారత రాజ్యాంగం ప్రజలకు తల్లితో సమానమని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలగౌడు అన్నారు. జిల్లాలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఐలు) రాష్ట్ర 10వ మహాసభలు శనివారం కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ప్రారంభమయ్యాయి. ఐలు రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సభలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు రిజర్వేషన్లలో 33 శాతం మాత్రమే కల్పించడం సమంజసమా? అని ప్రశ్నించారు. భవిష్యత్తు తరాలకు మానవతా విలువలు, నీతి, న్యాయం, సామాజిక స్పృహతో కూడిన విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ, మైనార్టీ ప్రజలు అనే తేడా ఉండదని, రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసేలా ఉండాలన్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ చట్టాలు న్యాయపాలన అనే అంశంపై జూనియర్ న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. ఇలాంటి సెమినార్లతో ఎన్నో విషయాలను నేర్చుకునే అవకాశం జూనియర్లకు కలుగుతుందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.సుమలత మాట్లాడుతూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే సమయంలో ఐలు నిర్వహించిన శిక్షణ శిబిరం తాను న్యాయమూర్తిగా ఎంపిక అయ్యేందుకు దోహదపడిందన్నారు. ఏపీ రాష్ట్ర ఐలు అధ్యక్షుడు ఎస్.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ న్యాయవాద సమస్యలు, సంక్షేమంతో పాటు వృత్తి పరిరక్షణకై సంఘం నిరంతరం కృషి చేసుందన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేసే విధంగా న్యాయమూర్తులు కృషి చేయాలని కోరారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు స్టైఫండ్, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ కర్నూలు న్యాయవాదులకు నూతన కార్యాలయ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐలు జాతీయ అధ్యక్షులు బట్టాచార్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు, కర్ణాటక, తెలంగాణ ఐలు నాయకులు నారాయణస్వామి, కోటేశ్వరరావు, కొల్లి సత్యనారాయణ, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా, జిల్లా జడ్జిలు ప్రేమావతి, రఘురామ్, శేషుబాబు, కె.సుధాకర్, సబ్ జడ్జిలు సోమశేఖర్, శివకుమార్, గాయత్రిదేవి, జూనియర్ సివిల్ జడ్జిలు రామచంద్రుడు, బాబు, స్వప్నారాణి, పి.రాజు, జిల్లా ఐలు నాయకులు పి.వెంకటస్వామి, పి.నిర్మల, కె.కుమార్, రవి, లక్ష్మణ్, తిరుపతమ్మ, న్యాయ వాదులు పాల్గొన్నారు.