రాష్ట్రానికి పెట్టుబడులతో రండి
► పారిశ్రామిక దిగ్గజాలకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
► రెండో రోజూ ఇండియా ఎకనమిక్ సమ్మిట్‌కు హాజరు
► 15 మంది పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను కోరారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం, సీఐఐ ఆధ్వర్యంలో ఢిల్లీలో శుక్రవారం రెండోరోజు జరిగిన ఇండియా ఎకనమిక్ సమ్మిట్‌కు కేటీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వరుసగా 15 మంది పారిశ్రామికవేత్తలతో భేటీ ఆయ్యారు. ముందుగా భారత్ ఫోర్డ్ కంపెనీ ఎండీ బాబా కల్యాణితో సమావేశమై తెలంగాణలో ఏరో స్పేస్, రక్షణ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో ఏరో టెక్నాలజీ వర్సిటీని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆలోచన గురించి ఆయనకు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కల్యాణీ...ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధమని తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో పర్యటించాలన్న విజ్ఞప్తికి అంగీకరించారు. పెట్టుబడుల విషయంలో త్వరలో సీఎం కేసీఆర్‌తో సమావేశమై చర్చిస్తానని కేటీఆర్‌కు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పాలసీలను అభినందించారు.
పేపర్ మిల్లింగ్‌లో అవకాశాలు...
జేకే టైర్స్ సీఎండీ రఘుపతి సింఘానియాతో సమావేశమైన కేటీఆర్ తెలంగాణలో పేపర్ మిల్లింగ్ రంగంలో ఉన్న అవకాశాలను వివరించారు. మూతపడిన సిర్పూర్ పేపర్ మిల్లు పున:ప్రారంభానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించి, పేపర్ మిల్లులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు రఘుపతి ఆసక్తి చూపారు. హెచ్‌పీ ఇండియా ఎండీ నీలమ్ ధావన్‌తో సమావేశంలో హైదరాబాద్‌లో సంస్థ కార్యకలాపాల విస్తరణ, స్మార్ట్ సిటీ సొల్యూషన్ల గురించి చర్చించారు. తెలంగాణలో ఒక పట్టణాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని స్మార్ట్ సిటీ సొల్యూషన్లతో మార్పునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేయగా ఈ ప్రతిపాదనపై నీలమ్ సానుకూలంగా స్పందించారు. నీటి సరఫరా, విద్యుత్ సరఫరాలో సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో సేవలను మెరుగుపరచడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.
సీఐఐ సహకారానికి విజ్ఞప్తి...
సీఐఐ అధ్యక్షుడు నౌషద్, డెరైక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీలతో కేటీఆర్ భేటీ అయ్యారు. పరిశ్రమల అభివృద్ధికి సీఐఐ చేస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,200 సంస్థలతో సీఐఐకు భాగస్వామ్యం ఉందని వారు తెలపగా ఈ సంస్థలు తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేలా సహకరించాలని కోరారు. దీంతోపాటు ఇతర దేశాల్లోని ఆదర్శ విధానాలు, పాలసీలను తెలియజేస్తే వాటిని తెలంగాణలో అమలు చేసేందుకు సిద్ధమన్నారు.
లాజిస్టిక్స్...ఆటోమొబైల్స్...టెలికం రంగాలపై...
లాజిస్టిక్స్ దిగ్గజం డీహెచ్ఎల్ ఎండీ వికాస్ ఆనంద్‌తో కేటీఆర్ సమావేశమై తెలంగాణలో ఏర్పాటు చేయనున్న డ్రైపోర్టుల గురించి, రాష్ట్రంలో లాజిస్టిక్స్ రంగంలో ఉన్న అవకాశాల గురించి వివరించారు. అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ కె దాసరితో సమావేశమై ఆటోమొబైల్ రంగంపై చర్చించారు. ఇప్పటికే మహీంద్రా ప్లాంట్ ద్వారా ఆటోమొబైల్ రంగంలో ముందంజలో ఉన్నామని, ఆటోమొబైల్ పరిశ్రమకు తెలంగాణలో అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో అశోక్ లేలాండ్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని కోరగా రాష్ట్రానికి తమ సంస్థ త్వరలోనే ఒక బృందాన్ని పంపుతుందని వినోద్ దాసరి తెలిపారు.
మొబైల్, టెలికం తయారీ సంస్థ జెడ్‌టీఈ, బ్రిటిష్ టెలికం సంస్థల ప్రతినిధులతో మంత్రి సమావేశమై ఫైబర్ గ్రిడ్‌కు అవసరమైన టెలికం పరికారాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. యాక్సెంచర్ గ్రూప్ చైర్పర్సన్ రేఖా మల్హోత్రా మీనన్‌తో సమావేశమై తెలంగాణలో సంస్థ విస్తరణను కొనసాగించాలని కోరారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న ఫిలిప్ రాస్లోర్తో కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు వినూత్న పాలసీలు, ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలుసుకున్న ఫిలిప్ త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తామని, దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు భాగస్వామ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.