వందేమాతరం ‘హోదా’ ఏమిటి?
- దేశ స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్య భూమిక
- జనం హృదయాల్లో నిలిచిపోయిన గేయం
- చట్ట, రాజ్యాంగపరమైన గుర్తింపు మాత్రం లేదు!
‘వందేమాతరం’ గేయం భారత స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్య భూమిక పోషించింది. స్వేచ్ఛా వాయువులు పీల్చాలనే భారతీయుల కాంక్షకు భావో ద్వేగ భూమికగా నిలిచింది. ఎందరో పోరాట యోధు లు వందేమాతరం ఆలపించి జైలు జీవితం అనుభవించారు. అంతగా పోరాట స్ఫూర్తిని నింపిన ‘వందేమాతరం’ గేయం దేశ స్వాతంత్య్రానంతరం తగిన గౌరవం పొందినా.. చట్టపరమైన, రాజ్యాంగపరమైన గుర్తింపు, రక్షణ దక్కలేదు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో వందేమాతరం ఆలపించలేదని ఏడుగురు ముస్లిం కౌన్సెలర్ల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్మానించారు. తాము వందేమాతరం ఆలపించబోమని, అయినా తమ సభ్యత్వం రద్దు చెల్లదని ఆ కౌన్సెలర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘వందేమాతరం’ గేయం, దానికి చట్టపర గుర్తింపునకు సంబంధించిన పరిస్థితి వివరాలివీ..
స్వాతంత్య్ర కాంక్షకు ప్రతీక
బంకిమ్ చంద్ర చటర్జీ 1876లోనే వందేమాతరం గేయాన్ని రాశారు. అయితే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరాలు కూర్చి ఆలపించాక బాగా ప్రాచు ర్యంలోకి వచ్చింది. 1896లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సభలో రవీంద్రుడు వందేమాతరం గేయాన్ని ఆలపించారు. అనంతర కాలంలో అది దేశవ్యాప్తమైంది. దేశభక్తికి, «బ్రిటిష్ పాలనపై ధిక్కారానికి ప్రతీకగా నిలిచింది. వందేమాతరం అని నినదించి ఎందరో జైలు జీవితాలు అనుభవించారు. 1911లో ఠాగూర్ ‘జనగణమన’ను రచించారు. దాన్ని ఆ ఏడాది డిసెంబర్ చివర్లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశాల్లో ఆలపించారు. 1947 ఆగస్టు14న రాత్రి 11 గంటలకు సమావేశమైన భారత రాజ్యాంగ సభ కూడా ఎజెండాలో మొదటి అంశంగా వందేమాతరంలోని మొదటి చరణాన్ని ఆలపించింది.
ముస్లింలీగ్ అభ్యంతరం మేరకు మొత్తం గీతాన్ని పాడలేదు. సమావేశం చివర్లో జనగణమనను పాడారు. స్వాతంత్య్రం వచ్చాక వందేమాతరం, జనగణమనల్లో ఏది జాతీయ గీతంగా ఉండాలనే చర్చ ప్రారంభమైంది. రాజ్యాంగ సభ దీనిపై నిర్ణయాన్ని వెలువరించాలి. కాంగ్రెస్ ‘జనగణమన’ వైపు మొగ్గింది. కారణం.. బహిరంగ రహస్యమే. ముస్లింలను నొప్పించకూడదని! రాజ్యాంగ సభ చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. తీర్మానం ప్రవేశపెట్టి.. చర్చ అనంతరం అవసరమైతే ఓటింగ్ చేపట్టాలని భావించారు. కానీ ఆ అవసరం రాకుండా.. నాటి పెద్దలంతా ఒక అవగాహనకు వచ్చారు. దాంతో రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్.. ‘‘జనగణమన.. భారతదేశానికి జాతీయగీతంగా ఉంటుంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో చారిత్రక పాత్రను పోషించిన వందేమాతరం గేయాన్ని జనగణమనతో సమానంగా గౌరవించాలి. తప్పకుండా సమాన హోదా ఉండాలి..’’ అని ప్రకటించారు.
‘వందేమాతరం’పై నిబంధనలేమీ లేవు!
► రాజ్యాంగ, చట్టపరమైన రక్షణలేవీ వందేమా తరం గేయానికి లేవు.
► 1971 డిసెంబర్ 23న జాతీయ చిహ్నలను అవ మానించడాన్ని నిరోధించే చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది. రాజ్యాంగం, జాతీయజెండా, జాతీయ గీతాలను అవమానించకుండా నిరోధించే నిబంధనలను అందులో పొందుపర్చారు. కానీ జాతీయగీతంతో సమాన హోదా ఉండాల్సిన జాతీయగేయం ‘వందేమాతరం’ ప్రస్తావన ఆ చట్టంలో ఎక్కడాలేదు.
► 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగంలోని ‘ఆర్టికల్51ఎ’లో పొందుపర్చారు. ‘ప్రతి భారత పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. రాజ్యాంగ విలువలను, సంస్థలను, జాతీయజెండాను, జాతీయ గీతాన్ని గౌరవించాలి’ అని అందులో పేర్కొన్నారు. అందులోనూ వందేమాతరం ప్రస్తావన లేదు.
► జాతీయ గేయమైన వందేమాతరానికి జనగణమనతో సమాన హోదా కల్పించాలని, ఆ మేరకు చట్ట సవరణ చేసేలా ఆదేశించాలని కోరుతూ గతేడాది నవంబర్‌లో గౌతమ్ ఆర్ మొరార్కా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
► ఈ పిల్ దాఖలైన తర్వాత.. ‘ఏయే సందర్భాల్లో వందేమాతరం ఆలపించాలనే విషయానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు. వందేమాతరం గేయానికి న్యాయం జరగాలంటే ఆ మేరకు నిబంధనలను రూపొందించాల్సిన అవసరముంది’ అని ప్రభుత్వం 2016 నవంబర్ 22న రాజ్యసభకు తెలిపింది.
► మొరార్కా పిల్‌పై హైకోర్టు ఇచ్చిన నోటీసుకు 2017 ఫిబ్రవరి8న కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.‘‘భారతీయుల మదిలో వందేమాతరం గేయానికి విశిష్ట స్థానముంది. అయితే జనగణమనతో సమానంగా దీనిని చూడలేం. సృజనాత్మకతను గౌరవించడానికి చట్టపరమైన రక్షణ కల్పించడం ఒక్కటే మార్గం కాదు. దేశానికి ఒకే జెండా, ఒకే జాతీయగీతం ఉంటాయి. అలాగని ఇతర గేయాలు, ప్రార్థనలకు తక్కువ గౌరవం ఇచ్చినట్లు కాదు. తమ మనసుకు నచ్చిన గీతాలు, పుస్తకాలు, చిహ్నాలను గౌరవించుకోకుండా పౌరులెవరినీ నిరోధించి నట్లు కాదు..’’ అని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్