మన ఫౌండ్రీకి చైనా ముప్పు..
20 శాతం కోల్పోతున్న వ్యాపారం
ధరా భారమవుతున్న ముడిసరుకు మానవ వనరులూ కొరతే
తెలంగాణ, సీమాంధ్రకు పొరుగు రాష్ట్రాల బెడద
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఫౌండ్రీమెన్ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫౌండ్రీ పరిశ్రమకు చైనా ముప్పు తప్పడం లేదు. భారత్‌లో ఉన్న లొసుగులను ఆ దేశం క్యాష్ చేసుకుంటోంది. దేశీయంగా ముడి సరుకులు ప్రియమవుతుండడంతో ఫౌండ్రీ పరిశ్రమలో తుది ఉత్పాదనలైన క్యాస్టింగ్స్ ధరలు కూడా అదే స్థాయిలో దూసుకెళ్తున్నాయి. ఈ అంశమే చైనా దూకుడుకు కారణమవుతోంది. దీంతో భారతీయ ఫౌండ్రీ పరిశ్రమ 20% దాకా వ్యాపారం కోల్పోతోంది. ప్రభుత్వం చొరవ తీసుకుంటే చైనాకు పోటీనివ్వడం ఖాయమని పరిశ్రమ అభివృద్ధికి 1950 నుంచి కృషి చేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఫౌండ్రీమెన్(ఐఐఎఫ్) అంటోంది.
వేడెక్కుతున్న సమస్యలు..: 15 ఏళ్ల క్రితం వరకు పిగ్ ఐరన్ ధర దేశవ్యాప్తంగా ఒకేలా ఉండేది. దీని తయారీలో ఉన్న ప్రైవేటు కంపెనీలు ప్రస్తుతం విలువ ఆధారిత ఉత్పత్తులపైనే దృష్టిసారిస్తున్నాయి. అంతేగాక ధర విషయంలో ఈ కంపెనీలదే తుది నిర్ణయమవుతోందని పరిశ్రమ వాపోతోంది. టన్ను పిగ్ ఐరన్ ధర అప్పట్లో రూ.5 వేలుంటే, నేడు రూ.35 వేలకు ఎగబాకిందని ఓ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.
భారతీయ బొగ్గులో బూడిద(యాష్) ఎక్కువగా ఉండడంతో నాణ్యమైన బొగ్గును టన్నుకు రూ.35 వేల దాకా వెచ్చించి విదేశాల నుంచి తెప్పిస్తున్నామని చెప్పారు. దీంతో తుది ఉత్పత్తుల ధర కాస్తా 20 శాతం దాకా పెరిగిందని ఐఐఎఫ్ దక్షిణ భారత చైర్మన్ వి.రామస్వామి తెలిపారు. వాహన పరిశ్రమ
తోసహా తయారీ రంగం రెండేళ్లుగా కుదేలవడం, మైనింగ్ నిషేధం తదితర కారణాలతో పరిశ్రమ వృద్ధికి ఆటంకంగా మారిందన్నారు. స్థిర ప్రభుత్వం రాకతో ఇక అన్ని రంగాల నుంచి క్యాస్టింగ్స్కు డిమాండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అవకాశాలను అందుకోవాలంటే ముడి సరుకుల ధరలకు కళ్లెం వేయడంతోపాటు విరివిగా ఫౌండ్రీ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం నడుం బిగించాలని కోరారు.
నిపుణుల కొరత..: క్యాస్టింగ్స్ తయారీలో ముడిసరుకును కరిగించే కొలిమిని 1,650 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తారు. తయారీ ప్రదేశం అత్యంత వేడిగా ఉండటంతో ఫౌండ్రీల్లో పనిచేసేందుకు చాలా మంది విముఖత చూపిస్తున్నారు. దినసరి కార్మికులకు ఒక్కో షిఫ్టుకు రూ.600 దాకా చెల్లిస్తున్నారు. లోహ శాస్త్రం చదివే విద్యార్థుల సంఖ్యా తగ్గుతోందని రామస్వామి చెప్పారు. నిపుణుల కొరత పరిశ్రమను పట్టిపీడిస్తోందన్నారు.
పొరుగు రాష్ట్రంలో ఒకలా..
సమైక్య రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం వరకు నెలకొన్న అనిశ్చితి, విద్యుత్ సమస్యలతో 60కిపైగా యూనిట్లు మూతపడ్డాయి. 150 యూనిట్లు ఖాయిలాపడ్డాయి. 30 వేల మంది రోడ్డున పడ్డారు. ఇదే అదనుగా ఇక్కడి అవకాశాలను కర్ణాటక చేజిక్కించుకుంది. రూ.200 కోట్లదాకా ఈ కంపెనీలకు రుణాలుండొచ్చని భాగ్యనగర్ ఫౌండ్రీస్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం చొరవ చూపితే తిరిగి ఈ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. మెదక్ జిల్లాలో ప్రతిపాదిత ఫౌండ్రీ పార్కు ఏ అడ్డంకులు లేకుండా త్వరితగతిన పూర్తి అయితే మరిన్ని పార్కులు వస్తాయని వెల్లడించారు. సీమాంధ్ర, తెలంగాణలో ఏటా సుమారు రూ.5,000 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతోంది.
విద్యుత్ కూడా సమస్యే..
తెలంగాణ, సీమాంధ్రలో విద్యుత్ చార్జీలు ఒక యూనిట్‌కు రూ.12తోపాటు ఎఫ్ఎస్ఏ అదనం. అదే పొరుగున ఉన్న కర్ణాటకలో రూ.6.50, తమిళనాడులో రూ.7.50 చార్జీ ఉంది. ఒక కిలో ముడిసరుకును కరిగించడానికి 1.2 యూనిట్ల విద్యుత్ అవసరం. మెదక్ జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ కంపెనీ మహారాష్ట్ర నుంచి రూ.2,000 కోట్ల విలువైన క్యాస్టింగ్స్ను తెప్పిస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా విద్యుత్ చార్జీలు ఒకేలా ఉండాలన్నది పరిశ్రమ డిమాండ్.
ఇదీ పరిశ్రమ విలువ..
భారత ఫౌండ్రీ పరిశ్రమలో దాదాపు 6,000కుపైగా కంపెనీలున్నాయి. 85 శాతం సూక్ష్మ, చిన్న, 10 శాతం మధ్యతరహా, 5 శాతం భారీ స్థాయిలో ఉన్నాయి. ఫై, నాన్ ఫై, అల్యూమినియం, స్టీల్ వంటి క్యాస్టింగ్స్ ఉత్పత్తి చేస్తున్నాయి. వాహ నాలు, రైల్వేలు, ఇంజిన్లు, మెషినరీ తయారీలో క్యాస్టింగ్స్ వినియోగం ఎక్కువ. ప్రత్యక్షంగా 5 లక్షలు, పరోక్షంగా 15 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. సుమారు 1.4 కోట్ల టన్నుల క్యాస్టింగ్స్ ఉత్పత్తి అవుతోంది. పరిశ్రమ విలువ రూ.1.2 లక్షల కోట్లుందని సమాచారం. ఎగుమతులు 10 శాతం దాకా నమోదవుతున్నాయి. 2020 నాటికి ఉత్పత్తి సామర్థ్యం 2.5 కోట్ల టన్నులకు చేరుకుంటుందని పరిశ్రమ చెబుతోంది. ప్రస్తుతం చైనా, అమెరికాల తర్వాతి స్థానంలో భారత్ నిలిచింది.