ఒమన్‌లో భారతీయుడి కిడ్నాప్.. భారీ మొత్తం డిమాండ్
ఒమన్‌లో ఓ భారతీయ కార్మికుడు కిడ్నాప్ అయ్యాడు. అతడిని విడిపించాలంటే భారీ మొత్తం ఇచ్చుకోవాల్సి ఉంటుందని అతడి కుటుంబ సభ్యులకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కేరళకు చెందిన హనీఫా అనే వ్యక్తి రెండు రోజుల క్రితం సోహర్ నగరంలో స్నేహితులను కలవడానికి వెళ్లినప్పుడు అపహరణకు గురయ్యాడు. ఎవరో స్నేహితుల వద్దకు వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు కూడా ఊరుకున్నారు. అయితే.. సౌదీ అరేబియాలో నివసించే అతడి బావమరిదికి ఆ తర్వాత ఉర్దూలో మాట్లాడిన కొంతమంది బెదిరింపు ఫోన్ కాల్స్ చేశారు.
దీంతో హనీఫా కిడ్నాప్ అయినట్లు బంధువులకు అర్థమైంది. అతడి విడుదలకు వారు భారీ మొత్తం డిమాండ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ ఆచూకీ తెలియకుండా ఉండేందుకు వారు ఇంటర్నెట్ నుంచి ఫోన్ కాల్స్ చేస్తున్నారు. తర్వాత అవి కూడా ఆగిపోయాయి. హనీఫా వద్ద ఉన్న ఫోన్ నుంచి కాల్స్ చేయడం ప్రారంభించారు. మొదట అతడి విడుదలకు దాదాపు 3.32 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు గానీ, తర్వాత ఆ డిమాండు మరింత పెరిగింది. దాన్ని వేరే దేశంలో డిపాజిట్ చేయాలని వారు కోరారు. అయితే, పోలీసులు త్వరలోనే కేసును ఛేదిస్తారని ఓ సామాజిక కార్యకర్త చెప్పారు.