పరదేశి బావార్చి
పాట్రిక్ లారెన్స్ చాప్‌మ్యాన్ . వయసు 74 ఏళ్లు. ఈ లండన్ దొర ఇండియాకు 44 సార్లు వచ్చాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరుగుతూనే ఉంటాడు. వెరైటీ ఇండియన్ వంటకం కనిపిస్తే చాలు లొట్టలేసుకుని తినడమే కాదు.. దాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుంటాడు. ఆ ఘుమఘుమలను తాను స్థాపించిన కర్రీ క్లబ్‌లోని మెంబర్స్‌కు నేర్పిస్తాడు. ఇటీవల బార్బీక్యూ నేషన్ రెస్టారెంట్ కోసం చాప్‌మ్యాన్ హైదరాబాద్ వచ్చాడు. ఈ ఎర్రతోలు మనిషికి మన మసాలాల గురించి ఎలా తెలిసిందని అడిగితే.. ‘ఇండియాకు స్వాతంత్య్రం రావడానికి ముందు మా పూర్వీకులు ఇక్కడే ఉండేవారు. మా అమ్మమ్మ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పుట్టింది.
ఆమె ఇక్కడే పెరిగింది. నా చిన్నతనంలో ఆమె నాకు రుచి చూపించిన ఇండియన్ క్వీజిన్ టేస్ట్ ఎప్పటికీ మరచిపోలేను. 1965 నుంచి తరుచూ ఇండియాకు వస్తూనే ఉన్నాను. నాకు ఇష్టమైన ఇండియన్ వంటకాల గురించి తెలుసుకుంటూనే ఉన్నా. వాటిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని 1982లో కర్రీక్లబ్ స్థాపించాను. ఆ క్లబ్లో సభ్యత్వం తీసుకున్నవారికి భారతీయ వంటకాలపై శిక్షణ అందిస్తున్నా. ఇప్పుడు మా క్లబ్లో 10వేల మంది సభ్యులున్నారని’ చెప్పుకొచ్చారు. భారతీయ వంటకాలపై విస్తృత పరిశోధనలు చేసిన చాప్‌మ్యాన్.. ఇండియన్ క్యుజిన్స్‌పై 36 పుస్తకాలు రాశారు కూడా. ఈ ఫారిన్ నలుడి పాకప్రావీణ్యానికి హ్యాట్సాఫ్ చెప్పేద్దాం.