'మృతుడి కుటుంబ సభ్యులకు 1.17 కోట్లు చెల్లించండి'
న్యూఢిల్లీ: నాలుగు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇండియన్ అయిల్ కార్పొరేషన్ ఉద్యోగి కుటుంబసభ్యులకు రూ.1.17 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని వాహన ప్రమాదాల పరిష్కారాల సంస్థ తీర్పునిచ్చింది. ఐఓసీలో ప్రాజెక్ట్ మేనేజర్ ముఖేశ్ ఖురానా కుటుంబసభ్యులకు రూ.1,17,10,224లు నష్టపరిహారాన్ని చెల్లించాలని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ను ప్రిసైడింగ్ ఆఫీసర్ హరీశ్ దుదని ఆదేశించారు. 2009 సెప్టెంబర్ 10న ముఖేశ్ వెళుతున్న వాహనాన్ని ఎదురుగా అతి వేగంతో వచ్చిన కారు అదుపుతప్పి ముఖేష్ ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. 49 ఏళ్ల ముఖేశ్ ఖురానా నెలకు రూ.1.14 లక్షలను సంపాదించేవాడని కుటుంబసభ్యులు వివరించారు. ముఖేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు.
ఈ ఘటనకు కారణమైన డ్రైవర్ హాజరు కాకపోవడం, ప్రమాదం ఏ పరిస్థితుల్లో జరిగిందన్న ఆధారాలు కూడా లభించలేకపోవడంతో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఈ మొత్తాన్ని బాధిత కుటుంబానికి చెల్లించాల్సి వస్తోంది. డ్రైవర్ రామ్ అవాధ్ ట్రాఫిక్ సిగ్నల్స్ ను జంప్ చేసే క్రమంలోనే ప్రమాదం జరిగిందన్న డాష్ ఎక్స్ పోర్ట్ యజమాని వాదనను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. దీనికి సరైన ఆధారాలు లేవని తెలిపింది.