‘నువ్వు అమెరికాలో అడుగుపెట్టలేవ్.. వెళ్లిపో..’
టోరంటో: భారత సంతతికి చెందిన కెనడియన్ మహిళకు అమెరికాలో అడుగుపెట్టేందుకు చిక్కులు ఎదురయ్యాయి. ఆమె సరిహద్దును దాటి అమెరికాలో అడుగుపెట్టాలంటే ఇమ్మిగ్రెంట్ వీసా కావాలంటూ అమెరికా అధికారులు అడ్డు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. మన్‌ప్రీత్ కైనర్ అనే మహిళ కెనడాలోని మాంట్రియల్ నగరంలో ఉంటోంది. ఇటీవల తాను అమెరికా వెళ్లాల్సి వచ్చి క్యూబెక్-వెర్మాంట్ సరిహద్దు వద్ద గల ప్రత్యేక తనిఖీ విభాగానికి చేరుకుంది. అక్కడే ఆమెను ఆరు గంటలపాటు ఎదురుచూసేలా చేశారు. వేలిముద్రలు, ఫొటోలు తీయడం, ప్రశ్నించడంలాంటి చర్యలు చేశారు.
ఇదంతా పూర్తయ్యాక ఆమెను అమెరికాలోకి అనుమతిస్తారనుకుంటే చివరి నిమిషంలో ఇమ్మిగ్రేషన్ వీసా ఉందా అని ప్రశ్నించి ఆమెను తిరస్కరించారు. ‘నేను ఇది నమ్మలేకపోతున్నాను. అమెరికాలోకి అడుగుపెట్టకుండా నన్ను తిరస్కరించారు. అమెరికాలోకి అడుగుపెట్టేందుకు నాకు వీసా ఉన్నప్పటికీ ఇమ్మిగ్రెంట్ వీసా కావాలంటూ అడ్డుకున్నారు. అది లేకుంటే నేను అమెరికాలో అడుగుపెట్టలేనని చెప్పారు. నేను వారికి ఒక వలసదారినిగా కనిపించాను’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఫేస్బుక్ పేజీలో ఆమె రాసుకొచ్చింది.