క్వార్టర్స్‌లో సైనా, సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
కోపెన్‌హాగెన్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు అద్భుతంగా ఆడి క్వార్టర్స్‌కు చేరారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సైనా 14-21, 21-18, 21-12 తేడాతో జపాన్‌కు చెందిన సయాకా టకాహషిపై నెగ్గింది. తొలి గేమ్‌లో తడబడ్డ సైనా... తర్వాత పుంజుకుని ప్రత్యర్థిని చిత్తుచేసింది. మరో ప్రి క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు ఓటమి అంచుల నుంచి తేరుకుని అద్భుతమైన పోరాటపటిమతో ఆడి గెలిచింది. తనకన్నా మెరుగైన ఆరో సీడ్ ఇయాన్ జు బే (కొరియా)పై సింధు 19-21, 22-20, 25-23 తేడాతో గెలిచింది.
రెండో గేమ్‌లో ఓడిపోయే దశ నుంచి తేరుకున్న సింధు... హోరాహోరీగా సాగిన ఆఖరి గేమ్‌లో ఒత్తిడిని జయించింది. క్వార్టర్స్‌లో సైనా... ప్రపంచ నంబర్‌వన్ లీ జురుయ్ (చైనా)తో, సింధు... ప్రపంచ నంబర్ టూ షిజియాన్ వాంగ్ (చైనా)తో తలపడతారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో కె.శ్రీకాంత్ 12-21, 10-21 తేడాతో రెండో సీడ్ లాంగ్ చెన్ (చైనా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి, సుమీత్ రెడ్డి 12-21, 17-21 తేడాతో యోంగ్ డే లీ, యియాన్ సియాంగ్ యూ (కొరియా) చేతిలో ఓడారు.