వారి సేవలకు సెల్యూట్
ఇరువురికి ఇండియన్ పోలీస్ మెడల్స్
క్రైం (కడప అర్బన్ ) / ప్రొద్దుటూరు క్రైం : జిల్లాలోని పోలీసు యంత్రాంగంలో పని చేస్తూ తమ విధి నిర్వహణలో విశిష్ట సేవలందిస్తున్న ఇరువురిని ఇండియన్ పోలీస్ మెడల్స్‌కు ఎంపిక చేస్తూ భారత ప్రభుత్వం జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో జిల్లా కేంద్రంలో ఆర్మ్డ్ రిజర్వుడు ఎస్ఐగా పనిచేస్తున్న వీసీ కుళ్లాయప్ప, ప్రొద్దుటూరు ట్రాఫిక్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పి.నరసయ్య (పీసీ నెంబరు 720) ఉన్నారు.
తాను చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించిన ందుకు కుళ్లాయప్ప హర్షం వ్యక్తం చేశారు. జమ్మలమడుగుకు చెందిన వీసీ కుళ్లాయప్ప 1982లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. 1994లో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందాడు. 2012లో ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తూ వస్తున్నారు. బాంబు స్క్వాడ్‌లో పనిచేస్తూ అనేక సందర్భాలలో బాంబులను నిర్వీర్యం చేసిన శ్రమకు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు.
కాగా ప్రొద్దుటూరు పట్టణంలో ట్రాఫిక్ పోలీస్టేషన్లో ఏఎస్ఐగా పని చేస్తున్న బాలశెట్టి నరసయ్య (పీసీ 720)ను ఇండియన్ పోలీస్ పతకం వరించింది. రాజంపేటకు చెందిన నరసయ్యకు భార్య వెంకటసుబ్బమ్మ, కుమార్తెలు బీఆర్ వరకుమారి, బీఆర్ మానస, కుమారుడు సాయినాథ్ ఉన్నారు. ఆయన 1979లో పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. జిల్లాలోని వీఎన్‌పల్లి,మైలవరం.
రాజుపాళెం తదితర స్టేషన్లలో పని చేశారు. 2008లో హెడ్‌కానిస్టేబుల్‌గా, 2013లో ఏఎస్ఐగా ప్రమోషన్ పొందారు. వీఎన్‌పల్లిలో పని చేస్తూ ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్టేషన్‌కు ఏడాదిన్నర క్రితం వచ్చారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు మెడల్ అందుకుంటారని అధికారులు తెలిపారు.