త్రివర్ణంలో బుర్జ్ ఖలీఫా
దుబాయ్ :
ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనం భారత జాతీయపతాకంలోని త్రివర్ణాలతో మెరిసిపోయింది. భారతదేశ 68వ గణతంత్ర వేడుకల్లో భాగంగా బుధ, గురువారాల్లో దుబాయ్‌లో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా భారత జాతీయ పతాకంలోని మూడు రంగుల వెలుగులతో బుర్జ్ ఖలీఫా టవర్ ముస్తాబయింది. ఓడ్ మెతాలోని ఇండియన్ హై స్కూల్‌తో పాటూ భారత రాయభార కార్యాలయంలో గురువారం కాన్సులేట్ అనురాగ్ భూషణ్ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. 'ఆజ్ కీ షామ్ దేశ్కే నామ్' పేరుతో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్‌లో ఇండియన్ హై స్కూల్ విద్యార్థులు పాల్గొననున్నారు.
68వ గణతంత్ర వేడుకల్లో అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్– నహ్యన్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే. గల్ఫ్ దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ఆయనకు భారత్ ఆహ్వానం పంపింది. 2006లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు (అరబ్ దేశాల నుంచి) సౌదీ రాజు అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ముఖ్య అతిథిగా పాల్గొనగా.. 2016 గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ హాజరయ్యారు.
కాగా, ప్రధాని మోదీ, అబుదాబి యువరాజు నహ్యన్ బుధవారం సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య బంధాన్ని బలపరిచేందుకు ఇద్దరు నేతలునిర్ణయాలు తీసుకున్నారు.