వందనకు కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ గా ఫార్వర్డ్ క్రీడాకారిణి వందన కటారియా నియమితురాలైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫికి 18 మందితో కూడిన జట్టును మంగళవారం ప్రకటించారు. ఉత్తరాఖండ్ ప్లేయర్ సునీత లక్రా వైస్ కెప్టెన్ గా ఎంపికైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫి ఈ నెల 29 నుంచి నవంబర్ 5 వరకు సింగపూర్ లో జరగనుంది. జపాన్, భారత్, చైనా, కొరియా, మలేసియా జట్లు ఈ టోర్నమెంట్ లో ఆడనున్నాయి.
కెప్టెన్ గా ఎంపిక కావడం పట్ల వందన సంతోషం వ్యక్తం చేసింది. "ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. జట్టు బలాలు, బలహీనతల గురించి మాకు తెలుసు. సమిష్టిగా, వ్యక్తితంగా మా ఆటను మెరుగుపరుచుకుని సత్తా చాటాలని భావిస్తున్నామ'ని వందన చెప్పింది. శాయ్ ఆధ్వర్యంలో భోపాల్ లో ప్లేయర్స్ కు శిక్షణ శిబిరం నిర్వహిస్తామని చీఫ్ కోచ్ నీల్ హాగూడ్ తెలిపారు.
మహిళల హాకీ జట్టు
వందన కటారియా(కెప్టెన్), సునీత లక్రా(వైస్ కెప్టెన్), సవితా, రజనీ(గోల్ కీపర్స్), దీప గ్రేస్ ఎక్కా, రేణుకా యాదవ్, నమితా టోప్పో, రాణి రాంపాల్, నిక్కీ ప్రదాన్, నవజ్యోత్ కౌర్, మోనిక, పూనం రాణి, అనురాధ దేవి, ప్రీతి దూబే, పూనం బార్లా, హైనియలామ్ లాల్ రౌత్ ఫెలి