Indian young players
-
కొత్తగా సత్తా చాటేందుకు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే సూపర్ స్టార్ల, అంతర్జాతీయ క్రికెటర్ల ఆటే కాదు... అప్పటి వరకు అనామకులుగా కనిపించిన వారిని కూడా హీరోలుగా మార్చేస్తుంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నించే భారత యువ ఆటగాళ్లకు ప్రతీ ఏటా లీగ్ అలాంటి అవకాశం కల్పిస్తుంది. ఈ వేదిక మీద సత్తా ప్రదర్శించి చెలరేగితే అందరి దృష్టినీ తమ వైపు తిప్పుకోవచ్చు. దేశవాళీ, జూనియర్ క్రికెట్లో ఇప్పటికే తమకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్నా... ఐపీఎల్ అందించే కిక్కే వేరు. అలాంటి ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కూడా ఏరికోరి జట్టులోకి తీసుకున్నాయి. రాబోయే ఐపీఎల్ –2020లో అలా అందరి దృష్టీ నిలిచిన కొందరు ‘అన్క్యాప్డ్’ యువ భారత ఆటగాళ్ల వివరాలు... యశస్వి జైస్వాల్ (రాజస్తాన్ రాయల్స్) ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించి ముంబైలో స్థిరపడ్డ 18 ఏళ్ల యశస్వి జైస్వాల్ ఈ ఏడాది అండర్–19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించే యశస్వి పేరిట దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎన్నో ఘనతలున్నాయి. 13 లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లలోనే అతను ఆరుసార్లు 50కి పైగా స్కోర్లు సాధించాడు. సగటు 70.81 కాగా, అందులో ఒక డబుల్ సెంచరీ ఉంది. రాజస్తాన్ రాయల్స్ తుది జట్టులో దాదాపుగా చోటు ఖాయం. మనన్ వోహ్రా, రాబిన్ ఉతప్పలతో ఓపె నర్ స్థానానికి పోటీ పడుతున్న యశస్వికే ఎక్కువ చాన్స్ ఉంది. అబ్దుల్ సమద్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) జమ్మూ కశ్మీర్‌కు చెందిన 19 ఏళ్ల సమద్‌ను ప్రతిభాన్వేషణలో భాగంగా స్వయంగా వీవీఎస్ లక్ష్మణ్ ఎంపిక చేశాడు. గత సీజన్లో అద్భుత బ్యాటింగ్‌తో రంజీ మ్యాచ్‌లో పటిష్ట కర్ణాటకపై చెలరేగి అందరి దృష్టిలో పడ్డాడు. స్పిన్ బౌలింగ్‌లో విరుచుకుపడగల సత్తా ఉంది. గత రంజీ సీజన్లో గరిష్ట మ్యాచ్‌ల కంటే రెండు మ్యాచ్‌లు తక్కువే ఆడినా అందరికంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఘనత అతని సొంతం. సన్‌రైజర్స్ ఆరు లేదా ఏడో స్థానంలో ఆడించి ఫినిషర్‌గా వాడుకునేందుకు మంచి అవకాశం ఉంది. రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్) చక్కటి టెక్నిక్ ఉన్న దూకుడైన మహారాష్ట్ర బ్యాట్స్‌మన్. గత రెండు సీజన్లలో కలిపి చూస్తే భారత దేశవాళీ వన్డేల్లో అతను అందరికంటే ఎక్కువ పరుగులు (15 ఇన్నింగ్స్‌లలో 843) సాధించాడు. ధోని మాటల్లో చెప్పాలంటే ‘చురుకైన బుర్ర’ కలవాడు. సాధారణంగా అతను ఓపెనింగ్ లేదా మూడో స్థానాల్లో ఆడతాడు. రైనా గైర్హాజరులో 23 ఏళ్ల రుతురాజ్‌కు సత్తా ఇది సువర్ణావకాశం. జట్టు యజమాని ఎన్. శ్రీనివాసన్ కూడా ఇదే మాట చెప్పారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఆరంభ మ్యాచ్‌లకు ఒకవేళ దూరమైనా...తర్వాతి నుంచైనా రుతురాజ్ చెలరేగిపోగలడు. దేవ్‌దత్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ఏడాది కాలంలో భారత దేశవాళీ క్రికెట్లో తన దూకుడైన ఆటలో ఎక్కువ మందిని ఆకట్టుకున్న క్రికెటర్ 20 ఏళ్ల దేవ్‌దత్. కేరళలో జన్మించి కర్ణాటక జట్టుకు ఆడుతున్న దేవ్‌దత్ గత దేశవాళీ సీజన్లో వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ, టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ రెండింటిలో కూడా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముస్తాక్ అలీ టోర్నీలోనైతే ఏకంగా 175.75 స్ట్రయిక్ రేట్‌తో అతను 580 పరుగులు సాధించడం విశేషం. బెంగళూరు జట్టులో ఓపెనర్ స్థానంలో అతను పార్థివ్ పటేల్‌తో పోటీ పడుతున్నాడు. రవి బిష్ణోయ్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) అండర్–19 ప్రపంచకప్‌లో అత్యంత ప్రభావం చూపించిన లెగ్ స్పిన్నర్. 6 మ్యాచ్‌లలో కలిపి 17 వికెట్లు తీసిన అతడిని ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఏమాత్రం సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. రాజస్తాన్‌కు చెందని 20 ఏళ్ల రవి బిష్ణోయ్ గుగ్లీలు ఎంత పెద్ద బ్యాట్స్‌మెన్‌నైనా ఇబ్బంది పెడతాయనేది సీనియర్ క్రికెటర్ల మాట. పంజాబ్ తుది జట్టులో కృష్ణప్ప గౌతమ్, అశ్విన్ మురుగన్ నుంచి పోటీ ఉన్నా... బిష్ణోయ్‌పై అందరి దృష్టి ఉంది. టీమ్ కోచ్‌గా లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఉండటంతో అతని మార్గనిర్దేశనంలో రవి మరింతగా రాటుదేలినట్లు టీమ్ వర్గాలు చెబుతున్నాయి. -
రంజీ సమరానికి వేళాయె
మూలపాడు (విజయవాడ): విజయ్ హజారే వన్డే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ వంటి పరిమిత ఓవర్ల క్రికెట్లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అలరించిన భారత యువ క్రికెటర్లను ఇక నాలుగు రోజులపాటు సాగే మ్యాచ్‌లు సవాళ్లు విసరనున్నాయి. వారిలోని నిజమైన టెక్నిక్‌ను, ఓపికను, ఫిట్నెస్ను పరీక్షించేందుకు నేటి నుంచి రంజీ ట్రోఫీ వేదిక కానుంది. ఇప్పటికే పరిమిత ఓవర్ల దేశవాళీ టోర్నీల్లో ఆకట్టుకున్న యువ ఆటగాళ్లు ఇక్కడ కూడా మెరిసి భారత టెస్టు జట్టులో స్థానం సంపాదించాలని చూస్తుండగా... పునరాగమనం కోసం మరికొందరు ఈ రంజీ సీజన్‌ను ఉపయోగించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇక గత రెండు సీజన్‌ల్లో టైటిల్ గెలిచి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో దిగుతున్న విదర్భ మరోసారి టైటిల్ గెలిచి హ్యాట్రిక్‌ను పూర్తి చేయాలని చూస్తోంది. అదే గనుక జరిగితే ముంబై తర్వాత హ్యాట్రిక్ టైటిల్స్‌ను గెలిచిన జట్టుగా నిలుస్తుంది. తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో ఆంధ్రతో విదర్భ... హైదరాబాద్‌తో గుజరాత్ జట్లు తలపడనున్నాయి. సీజన్ జరిగే తీరు... గత సీజన్లో 37 జట్లు బరిలో దిగగా... ఈసారి చండీగఢ్ రూపంలో కొత్త జట్టు ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో మొత్తం 38 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక గ్రూప్ ‘ఎ’–‘బి’లను కలిపి ‘టాప్–5’ స్థానాల్లో నిలిచిన జట్లు, గ్రూప్ ‘సి’ నుంచి ‘టాప్–2’ జట్లు, ప్లేట్ గ్రూప్ నుంచి ఒక జట్టు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. మార్చి 9 నుంచి ఫైనల్ జరుగుతుంది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’: ఆంధ్ర, హైదరాబాద్, విదర్భ, కేరళ, ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, బెంగాల్. ఎలైట్ గ్రూప్ ‘బి’: ముంబై, బరోడా, హిమాచల్ ప్రదేశ్, సౌరాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రైల్వేస్, మధ్యప్రదేశ్. ఎలైట్ గ్రూప్ ‘సి’: త్రిపుర, జమ్మూ కశీ్మర్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఒడిశా, సరీ్వసెస్, హరియాణా, జార్ఖండ్, అస్సాం. ప్లేట్ గ్రూప్: గోవా, మేఘాలయ, మణిపూర్, మిజోరం, చండీగఢ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, బిహార్. -
యువ తడాఖా...
అదే జోరు.. అదే ఫలితం.. టోర్నీ ఆద్యంతం దూకుడే మంత్రంగా చెలరేగిపోయిన భారత యువ ఆటగాళ్లు ఆఖరి అడ్డంకిని అద్వితీయంగా అధిగమించారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతూ అంతిమ సమరంలోనూ తమ తడాఖా చూపించారు. ఆసియా జూనియర్ పురుషుల హాకీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచారు. ఆసియా జూనియర్ హాకీ చాంపియన్ భారత్ * ఫైనల్లో పాకిస్తాన్‌పై 6-2తో ఘనవిజయం * హర్మన్‌ప్రీత్ సింగ్ ‘హ్యాట్రిక్’ క్వాంటన్ (మలేసియా): లీగ్ మ్యాచ్‌లలో తాము ప్రదర్శించిన ఆటతీరు గాలివాటం కాదని భారత హాకీ జట్టు నిరూపించింది. ఆసియా జూనియర్ పురుషుల హాకీ చాంపియన్‌షిప్‌లో చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 6-2 గోల్స్ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ ‘హ్యాట్రిక్’తో కలిపి నాలుగు గోల్స్ (10, 15, 30, 53వ నిమిషాల్లో) చేయగా... అర్మాన్ ఖురేషీ (44వ నిమిషంలో), మన్‌ప్రీత్ జూనియర్ (50వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. పాకిస్తాన్ జట్టులో మొహమ్మద్ యాకూబ్ (28వ నిమిషంలో), మొహమ్మద్ దిల్బర్ (68వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. దక్షిణ కొరియా జట్టుకు మూడో స్థానం లభించింది. వర్గీకరణ మ్యాచ్‌లో కొరియా 2-1తో జపాన్ను ఓడించింది. పాక్ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయని భారత ఆటగాళ్లు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగారు. సమన్వయంతో ముందుకు కదులుతూ అవకాశం దొరికినపుడల్లా ప్రత్యర్థి వలయంలోకి దూసుకెళ్లారు. నిరంతర దాడుల ఫలితంగా భారత్‌కు పదో నిమిషంలో తొలి పెనాల్టీ కార్నర్ లభించింది. దానిని హర్మన్‌ప్రీత్ లక్ష్యానికి చేర్చడంతో భారత్ ఖాతా తెరిచింది. ఐదు నిమిషాల తర్వాత లభించిన మరో పెనాల్టీ కార్నర్‌ను కూడా హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలచడంతో భారత్ ఆధిక్యం 2-0కు చేరింది. 28వ నిమిషంలో యాకూబ్ గోల్‌తో పాక్ ఖాతా తెరిచినా... వారి ఆనందం రెండు నిమిషాల్లోనే ఆవిరైంది. 30వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సద్వినియోగం చేసుకోవడంతో అతని ఖాతాలో ‘హ్యాట్రిక్’ చేరింది. విరామ సమయానికి భారత్ 3-1తో ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలోనూ భారత్ దూకుడుగా ఆడింది. తొమ్మిది నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ సాధించి 6-1తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక మ్యాచ్ ముగియడానికి రెండు నిమిషాలముందు పాక్ జట్టుకు దిల్బర్ గోల్ అందించినా అప్పటికే ఆలస్యమైపోయింది. * 28 ఏళ్ల ఆసియా జూనియర్ హాకీ కప్ చరిత్రలో భారత్ విజేతగా నిలువడం ఇది మూడోసారి. గతంలో భారత్ 2004, 2008లలో టైటిల్‌ను సొంతం చేసుకుంది. 1987, 2012లలో మూడో స్థానం పొందిన భారత్ 1996, 2000లలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 1992లో మాత్రం నాలుగో స్థానానికి పరిమితమైంది. * ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్లో భారత్ అజేయంగా నిలిచింది. లీగ్ దశలో 2-1తో జపాన్‌పై, 5-4తో మలేసియాపై, 4-1తో చైనాపై గెలిచిన టీమిండియా... క్వార్టర్ ఫైనల్లో 9-0తో ఒమన్‌పై, సెమీఫైనల్లో 6-1తో జపాన్‌పై విజయం సాధించింది. * కోచ్ హరేంద్ర సింగ్ పర్యవేక్షణలో హర్జీత్ సింగ్ నాయకత్వంలో ఈ టోర్నీలో మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన భారత్ 32 గోల్స్ చేసి తొమ్మిది గోల్స్‌ను ప్రత్యర్థి జట్లకు సమర్పించుకుంది. * భారత్ విజేతగా నిలువడంలో ‘డ్రాగ్ ఫ్లికర్’ హర్మన్‌ప్రీత్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. అతను ఈ టోర్నీలో మొత్తం 14 గోల్స్ చేయగా... అందులో పెనాల్టీ కార్నర్ల ద్వారానే 13 గోల్స్ రావడం విశేషం. ఫైనల్ ఉత్కంఠభరితంగా సాగింది. కుర్రాళ్లు సంయమనం కోల్పోకుండా ఆద్యంతం ఏకాగ్రతతో ఆడారు. సుల్తాన్ జొహర్ కప్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాం. దాంతో ఇక్కడ విజేత కావాలనే పట్టుదలతో ఆడాం. ప్రేక్షకుల నుంచి ఊహించని మద్దతు లభించింది. స్వదేశంలో ఆడుతున్నట్లే అనిపించింది. భవిష్యత్‌లో ఇదే జోరును కొనసాగించి మరిన్ని విజయాలు సాధిస్తాం. -కోచ్ హరేంద్ర సింగ్