Indias Sovereign Rating
-
ఏడాదిపాటు స్థిరంగానే భారత్ రేటింగ్
►అప్‌గ్రేడ్ కావాలంటే ద్రవ్యలోటు కట్టడి, ►సంస్కరణలపై మరిన్ని చర్యలు కీలకం ►మోర్గాన్ స్టాన్లీ రీసెర్చ్ నివేదిక... ముంబై: భారత్ సార్వభౌమ(సావరీన్) పరపతి రేటింగ్ వచ్చే ఏడాదిపాటు స్థిరంగానే కొనసాగవచ్చని అంతర్జాతీయ బ్రోకరేజి దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. అయితే, రేటింగ్ అప్‌గ్రేడ్ కావాలంటే మాత్రం ప్రభుత్వం ద్రవ్యలోటు కట్టడి, ప్రభుత్వ వ్యయాల తగ్గింపు, ఇంధన సబ్సిడీల్లో కోత, సంస్కరణల దిశగా మరిన్ని నిర్ణయాత్మక, సమయానుకూల చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. మూడీస్ ప్రస్తుతం భారత్‌కు ‘బీఏఏ3’ రేటింగ్‌ను, ఫిచ్ ‘బీబీబీ-’ రేటింగ్‌ను స్టేబుల్(స్థిరం) అవుట్‌లుక్‌తో కొనసాగిస్తున్నాయి. అయితే, ఒక్క స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) మాత్రమే ‘బీబీబీ-’ నెగటివ్(ప్రతికూల) అవుట్‌లుక్‌తో రేటింగ్‌ను కొనసాగిస్తోంది. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్‌లో ఇదే అతితక్కువ స్థాయి రేటింగ్. ఇంతకంటే తగ్గితే జంక్(పెట్టుబడులకు అత్యంత ప్రతికూలం) స్థాయికి పడిపోతుంది. దీనివల్ల దేశీ కంపెనీలు, ప్రభుత్వానికి విదేశీ నిధుల సమీకరణ చాలా భారంగా మారుతుంది. భారత్ రేటింగ్ రానున్న కాలంలో డౌన్‌గ్రేడ్ అయ్యేందుకు ఏజెన్సీలు ఎలాంటి నిర్దిష్ట కారకాలనూ(ట్రిగ్గర్స్) పేర్కొనలేదు. అయితే, రేటింగ్ అవుట్‌లుక్‌ను నెగటివ్ నుంచి మళ్లీ స్థిరానికి పెంచాలంటే.. వృద్ధి పుంజుకోవడం, ఆర్థిక క్రమశిక్షణ, ద్రవ్యోల్బణం తగ్గుదల చాలా ముఖ్యమని ఎస్అండ్పీ అంటోంది. రేటింగ్ ఏజెన్సీలతో ఆర్థిక శాఖ సమావేశాలు... భారత్ సావరీన్ రేటింగ్‌ను పెంచాల్సిందిగా కోరేందుకు వచ్చే 2-3 నెలల్లో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలతో కేంద్ర ఆర్థిక శాఖ సమావేశం కానుంది. ద్రవ్యలోటు కట్టడికి(ఈ ఏడాది 4.1 శాతం లక్ష్యం) తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించిన చర్యలను ఈ సందర్భంగా వివరించనుంది. ఆగస్టు 12న ఎస్అండ్పీ, 28న జపాన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ(జేసీఆర్ఏ) ప్రతినిధులతో భేటీ కానున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఫిచ్, మూడీస్ ప్రతినిధులతో సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో సమావేశాలు ఉండొచ్చని ఆయన చెప్పారు. 2016-17కల్లా ద్రవ్యలోటును 3%కి తగ్గించాలనేది కేంద్రం లక్ష్యం. -
రేటింగ్ గండం!
న్యూఢిల్లీ: ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం వృద్ధికి తోడ్పడేలా విశ్వసనీయమైన ప్రణాళిక ప్రకటించకపోతే భారత సార్వభౌమ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయాల్సి వస్తుందని రేటింగ్స్ ఏజెన్సీ సాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) హెచ్చరించింది. ఆర్థిక పరిస్థితులు అసాధారణంగా దిగజారితే తప్ప తదుపరి రేటింగ్‌ను.. ఎన్నికలైన తర్వాత కొత్త ప్రభుత్వ విధానాలను బట్టి సమీక్షిస్తామని పేర్కొంది. భారత్‌కు ‘బీబీబీమైనస్’ స్థాయిని నెగటివ్ అంచనాలతో యథాతథంగా కొనసాగిస్తున్నట్లు గురువారం వెల్లడించిన సందర్భంగా ఎస్అండ్పీ ఈ అంశాలు తెలిపింది. పెట్టుబడులకు సంబంధించి బీబీబీ రేటింగ్ కనిష్ట స్థాయి గ్రేడ్. ఇంతకన్నా డౌన్‌గ్రేడ్ చేస్తే అధమ స్థాయికి పడిపోయినట్లవుతుంది. కార్పొరేట్లు రుణాలు తీసుకోవాలంటే మరింత అధిక వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు, ఎస్అండ్పీ రేటింగ్ సమీక్ష అంశం సాధారణమైనదేనని, ఆందోళన చెందాల్సినదేమీ కాదని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారాం చెప్పారు. గతేడాది ఏప్రిల్‌లో భారత రేటింగ్ అంచనాలను నెగటివ్ స్థాయికి కుదించిన ఎస్అండ్పీ తాజాగా..ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి స్పెక్యులేటివ్ గ్రేడ్‌కి దీన్ని తగ్గించే అవకాశం ఉందని తెలిపింది. ఒకవేళ కొత్త ప్రభుత్వం వృద్ధి, సంస్కరణలు ఊతమిచ్చే చర్యలు తీసుకుంటే అప్గ్రేడింగ్కి కూడా ఆస్కారం ఉందని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్టమైన 4.4 శాతంగా నమోదైన నేపథ్యంలో ఎస్అండ్పీ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొత్త ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉంటాయని ఎస్అండ్పీ పేర్కొంది. డీజిల్ సబ్సిడీలను ఎత్తివేయడం, ఇతరత్రా సబ్సిడీలకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం, జాతీయ స్థాయిలో వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) అమలు వంటి అంశాలను కొత్త ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సి ఉంటుం దని ఎస్అండ్పీ పేర్కొంది. బలాలున్నాయ్..బలహీనతలున్నాయ్.. రేటింగ్‌ను ప్రస్తుతానికి యథాప్రకారం కొనసాగించడానికి భారత్‌కి ఉన్న బలాలే కారణమని ఎస్అండ్పీ వివరించింది. వంద కోట్ల పైగా జనాభాతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థ, తక్కువ విదేశీ రుణం, తగినన్ని విదేశీ మారక నిల్వలు మొదలైనవి బలాలని పేర్కొంది. అయితే, ఇదే స్థాయిలో బలహీనతలూ ఉన్నాయని వ్యాఖ్యానించింది. వ్యవస్థాగతమైన సంస్కరణల్లో పురోగతి లేకపోవడం వంటివి ఇందులో ఉన్నాయని ఎస్అండ్పీ వివరించింది. ఒకవైపు డీజిల్ ధరలను డీరెగ్యులేట్ చేయడమన్న సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మరోవైపు సబ్సిడీ భారం పెరిగిపోయేలా ఆహార భద్రత చట్టం తెచ్చి ఇన్వెస్టర్లకు మిశ్రమ సంకేతాలు పంపిందని పేర్కొంది.