అబ్బాయిలు అలా.. అమ్మాయిలు ఇలా..
కోల్ కతా: టీ20 ప్రపంచకప్ లో తొలి రెండు మ్యాచుల్లో భారత పురుషులు, మహిళల జట్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. రెండు టీమ్ లు రెండేసి మ్యాచ్ లు అడగా ఒక్కో విజయాన్ని నమోదు చేశాయి. మొదటి మ్యాచ్ లో 'మెన్ ఇన్ బ్లూ' ఓడిపోగా, అమ్మాయిలు తమ మొదటి మ్యాచ్ లో శుభారంభం చేశారు. రెండో మ్యాచ్ లో పురుషుల టీమ్ నెగ్గగా, అమ్మాయిల జట్టు ఓడింది.
నాగపూర్ లో ఈ నెల 15న ఆరంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడిన ధోని సేన శుభారంభం అందుకోలేక చతికిలపడింది. 47 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఈడెన్ గార్డన్ లో 19న జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది ఆరంభ ఓటమి నుంచి కోలుకుంది. ఆరు వికెట్ల తేడాతో దాయాది జట్టును చిత్తు చేసి సత్తా చాటింది.
బెంగళూరులో ఈ నెల 15న బంగ్లాదేశ్ తో జరిగిన తమ తొలి మ్యాచ్ లో ఇండియా వుమెన్స్ టీమ్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 19న పాకిస్థాన్ తో జరిగిన రెండో మ్యాచ్ లో 2 పరుగులతో తేడాతో మిథాలి సేన ఓడింది. గెలిచే అవకాశం భారతవైపు మొగ్గిన తరుణంలో వరుణుడు మిథాలీసేన ఆశలపై నీళ్లుజల్లాడు. భారీ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. దీంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ రెండు పరుగులతో విజయం సాధించింది.