పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ఆరోపణలు
లాహోర్: పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ ఖమర్ జావెద్ బజ్వాపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరోక్ష విమర్శలు చేశారు. తన పదవి పోయేందుకు కీలక స్థానాల్లో ఉన్న కొందరు కారణమని దుయ్యబట్టారు. తన పార్టీ కార్యకర్తలనుద్దేశించి ‘ప్రతి సంస్థలో మనుషులుంటారు. అందులో ఒకరిద్దరు తప్పుడువారైనంత మాత్రాన మొత్తం సంస్థను బాధ్యురాలిగా చేయలేము. ఒకవేళ ఒకరు (జనరల్ బజ్వా) తప్పు చేస్తే అది మొత్తం సంస్థ తప్పు చేసినట్లు కాదు.’’ అని ఆయన ట్వీట్ చేశారు.
సైన్యానికి తమ పార్టీకి మధ్య సంబంధాలు గత కొద్ది నెలలుగా క్షీణించాయని పాక్ మాజీ మంత్రి ఫవాద్ చెప్పారు. ఐఎస్ఐ చీఫ్‌గా నదీమ్ అంజుమ్ నియామకాన్ని ఇమ్రాన్ గతేడాది తొలుత తిరస్కరించి తర్వాత ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయనకు సైన్యంతో చెడింది. దేశ చరిత్రలో గుర్తుండే ర్యాలీ నిర్వహణకు తన మద్దతుదారులంతా గురువారం మినార్ ఐ పాకిస్తాన్‌కు చేరాలని ఇమ్రాన్ పిలుపునిచ్చారు. ఒకపక్క ఆర్మీ చీఫ్‌ను విమర్శిస్తూ మరోపక్క సైన్యాన్ని ఆయన ప్రశంసించారు.