మిత్రులను మిగల్చని దౌత్యనీతి
67 ఏళ్ల భారత్ విదేశాంగ విధానం
ప్రపంచ గమనాన్ని పట్టించుకోని రీతిలో దశాబ్దాల పాటు ఆ విధానాన్ని కొనసాగించడం ఒక బలహీనతేనని చరిత్ర రుజువు చేసింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనా, శ్రీలంక, నేపాల్, మైన్మార్- భారత్‌ను చుట్టి ముట్టి ఉన్న ఈ దేశాలలో ఒక్క దానితో అయినా మనకు ఒక్క దశాబ్దం పాటైనా సత్సంబంధాలు ఉన్నాయా?
నరేంద్ర మోడీ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి (మే 26, 2014) ఇరుగు పొరుగు దేశాల అధినేతలు హాజరు కావడంతో, మన విదేశాంగ విధానంలో కొత్త పోకడలు తథ్యమని విశ్లేషకులు భావించడం ప్రారంభించారు. మన విదేశాంగ విధానానికి బీజాలు వేసి, చాలా కాల ం శాసించిన వారు మొదటి ప్రధాని పండిట్ నెహ్రూయే. కానీ నెహ్రూ మరణించి ఐదు దశాబ్దాలు గడిచి పోయాయి. ప్రపంచ రాజకీయ సమీకరణలన్నీ మారిపోయాయి. సిద్ధాం తాలు అర్థం మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలో నెహ్రూ విధానాలతో విభేదిం చే బీజేపీ సంపూర్ణ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. నెహ్రూ విదేశీ వ్యవ హారాలలో మౌలిక అంశాలను కూడా తీసుకునే వీలు దాదాపు లేనందునే మోడీ అనుసరించబోయే విదేశాంగ విధానం ఆసక్తికరంగా మారింది.
నమ్మదగిన మిత్రదేశం ఏది?
‘విదేశీ వ్యవహారాలనేవి అంతిమంగా ఆర్థిక విధానం నుంచే ఉద్భవిస్తాయి. కాబట్టి భారత్ తనదైన ఆర్థిక విధానం రూపొం దించుకునే వరకు విదేశాంగ విధానం కొంచెం అస్పష్టంగానే ఉంటుంది.’ డిసెంబర్, 1947లో రాజ్యాంగ పరిషత్ చర్చ సందర్భంగా పండిట్ నెహ్రూ చెప్పిన మాటలివి. ఆయన దృష్టికి జోహార్లు. కానీ, ఆర్థిక విధానాలతో సమా నంగా సైనిక, వ్యూహాత్మక అవసరాలు కూడా అంతర్జాతీయ సంబంధాలను శాసించే రోజు వస్తుందని ఆ ‘శాంతిదూత’ ఊహించలేదు. నెహ్రూ జీవించి ఉన్న కాలంలోనే ఆయన విధానాల మీద విమర్శలు కురిశాయి. విదేశాంగ విధానం గురించి ఆలోచించడానికి 1925లో భారత జాతీయ కాంగ్రెస్ ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకుంది. దానికి అన్నీ తానే అయి నిర్వహించిన వారు నెహ్రూ. భారత స్వాతంత్య్రోద్యమం అవసరాన్నీ, సందర్భాన్నీ వివరిం చడానికి ఆయన అప్పుడే అనేక దేశాలు తిరిగివచ్చారు. 1946లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తరువాత విదేశీ వ్యవహారాలకు తనదైన శైలిలో ఆకృతిని ఇచ్చారు. కానీ పాక్, చైనా యుద్ధాలు ఆయన విశ్వాసాలకు ఆదిలోనే విఘా తం కలిగించాయి. 1962 నాటి చైనా యుద్ధం మిగిల్చిన క్షోభతోనే ఆయన కన్ను మూశారని పీవీ నరసింహారావు వంటివారు (లోపలిమనిషి) విశ్లేషిం చారు. నిజానికి ఈ వైఫల్యం ఆరున్నర దశాబ్దాల స్వతంత్ర భారతదేశాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. మారిన పరిస్థితులు, ప్రపంచ రాజకీయాలు, మన విదేశాంగ విధానంలో బలహీనత, ఏమైనా కావచ్చు- స్వతంత్ర భారతావ నికి ఇరుగునా, పొరుగునా ఒక్క మిత్రదేశాన్ని కూడా తయారు చేసుకునే అవ కాశాన్ని కల్పించలేదు. ఒక ఆదర్శంగా అలీన విధానం గొప్పదే. కానీ, ప్రపం చ గమనాన్ని పట్టించుకోని రీతిలో దశాబ్దాల పాటు ఆ విధానాన్ని కొనసాగిం చడం ఒక బలహీనతేనని చరిత్ర రుజువు చేసింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనా, శ్రీలంక, నేపాల్, మైన్మార్ - భారత్‌ను చుట్టి ముట్టి ఉన్న ఈ దేశాలలో ఒక్క దానితో అయినా మనకు ఒక్క దశాబ్దం పాటైనా సత్సంబంధాలు ఉన్నాయా? ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేళైనా ఈ ప్రశ్న వేసుకోవాలి.
ఇరుగు పొరుగుతో బంధం ఇది!
భారత్ అహింసాయుతంగా స్వాతంత్య్రం తెచ్చుకుంది. కానీ భారత్-పాక్ విభజన ప్రపంచ చరిత్రలోనే పెద్ద రక్తసిక్త ఘటన. అది మొదలు రెండు దేశాల మధ్య ఈ క్షణం వరకు శాంతి నెలకొనలేదు. 1947, 1965, 1971, 1999- నాలుగుసార్లు పాకిస్థాన్‌తో భారత్ తలపడవలసి వచ్చింది. సరిహద్దులలో కాల్పులకు లెక్కలేదు. పాక్ నేతలు కాశ్మీర్ వివాదాన్ని తమ మనుగడకు ఉపకరించే అంశంగా మలుచుకున్నారు. కాశ్మీర్ సమస్య, ఉగ్రవాదం రెండు దేశాల బంధం ఏమాత్రం బలపడకుండా చేశాయి. సంరతా ఎక్స్‌ప్రెస్ రైలు, ఢిల్లీ-లాహోర్ బస్సు, శ్రీనగర్-ముజఫరాబాద్ బస్సు-ఇవేవీ సంబంధాలను మెరుగుపరచలేకపోయాయి. 2001 నాటి పార్లమెంటు భవనం మీద ఉగ్రవాద దాడి, 2008 నాటి ముంబై దాడులు రెండు దేశాల మధ్య ఇనుప తెరను బిగించాయి. 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భవించిన తరువాత మొదట గుర్తించిన దేశం భారత్. కానీ ఆ సత్సంబంధాన్ని బంగ్లాదేశ్ కొనసాగించలేదు. పాకిస్థాన్ వలెనే, బంగ్లా కూడా భారత వ్యతిరేక ఉగ్రవాద మూకలకు ఆశ్రయం ఇచ్చే దేశంగా మారిపోయింది. అవామీ లీగ్ అధికారంలో ఉన్న 1972, 1996లో మినహా బంగ్లాతో సంబంధాలు సజావుగా లేవు. ఫరక్కా బ్యారేజీ, దక్షిణ తాల్పట్టి, తీన్ భిగా ప్రాంతాల మీద వివాదం కొనసాగుతూనే ఉంది. చైనాతో సత్సంబంధాలపై నెహ్రూకు ఆనాడే సందేహాలు ఉన్నాయి. 1950 దశకంలో పెకింగ్ యాత్ర చేసినపుడే ‘ఆసియాలోని ఈ రెండు దిగ్గజాలు (భారత్, చైనా) ఏదో ఒక రోజున తలపడే రోజు వస్తుంది’ అని ఆయన హెచ్చరించారు. మక్‌మెహన్ రేఖ, అక్సాయ్‌చిన్, అరుణాచల్ ప్రదేశ్లు కేంద్రబిందువులుగా ఉన్న వివాదాలను రెండు దేశాలు ఈనాటి వరకు పరిష్కరించుకోలేకపోయాయి. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే రీతిలో ఇప్పుడు చైనా చౌక వస్తువులు వెల్లువెత్తుతున్నాయి. సాంస్కృతికంగా ఎంతో దగ్గరగా ఉండే నేపాల్ కూడా చైనాకు బాసటగానే ఉంటోంది. టిబెట్ మీద డ్రాగన్ ఆధిపత్యాన్ని అంగీకరించినందుకు భారత్‌కు విమర్శలు తప్ప చైనా వైపు నుంచి కాస్త మేలు కూడా జరగలేదు. శ్రీలంక జాతుల సమస్యలో భారత్ తలదూర్చినప్పటి నుంచి ఆ దేశంతో సంబంధాలు క్షీణించాయి. అంతిమంగా ఆ పరిణామాలు రాజీవ్‌గాంధీని బలితీసుకున్నాయి. మైన్మార్‌లో సైనిక జుంటా, ఆఫ్ఘాన్‌లో ఉగ్రవాదం సత్సంబంధాలకు తావు లేకుండా నిలిపి ఉంచాయి.
మార్పు సహజం
ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో భారత్ అలీన విధానాన్ని నిక్కచ్చిగా అమలు చేసింది. అయితే కాశ్మీర్ విషయంలో సోవియెట్ రష్యా ఇచ్చిన మద్దతుతో అటు వైపే ఎక్కువ మొగ్గు చూపడం రహస్యమేమీ కాదు. సోషలిస్టు స్వాప్ని కుడు నెహ్రూ కూడా రష్యా అంటేనే అభిమానం చూపేవారు. ఈ బంధం వల్లనే ఆఫ్గాన్‌లో రష్యా తిష్టపై భారత్ నీళ్లు నమిలి, తన విధానంలోని బలహీనతను బయటపెట్టుకుంది. అప్పుడే (1990) ప్రపంచంతో పాటు భారత్‌ను కూడా పెనుమార్పులకు లోను చేసింది. సోవియెట్ రష్యా పతనం, భారత ఆర్థిక సంక్షోభం, కాశ్మీర్లో ఉగ్రవాదం పెచ్చరిల్లడం ఆ సంవత్సరమే జరిగింది. ఇవి ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న పరిణామాలే కూడా. రష్యా బలహీనపడడంతో ఆఫ్గాన్‌లో ఉగ్రవాద మూకలు కాశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఏక ధ్రువ ప్రపంచంలో భారత్ తన విదేశాంగ విధానాన్ని సహజంగానే పునస్సమీక్షించుకుంది. అమెరికాతో 1980 దశకం నుంచి మైత్రి ఉన్నప్పటికీ, సోవియెట్ రష్యా పతనంతోనే ఇండో అమెరికా స్నేహం కొత్త పుంతలు తొక్కింది. అలాగే 1992 నాటి లుక్‌ఈస్ట్ విధానం కూడా రష్యా పతనం ఫలితమే. అంటే ప్రచ్ఛన్న యుద్ధానంతర పరిణామమే. దానితో ఆగ్నేయాసియా దేశాలతో భారత్ స్నేహ బంధం విస్తరించింది. దశాబ్దాల నిశ్శబ్దాన్ని వీడి ఎన్డీయే ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలకు శ్రీకారం చుట్టడం భారత విదేశాంగ విధానంలో పెద్ద పరిణామం. 1998లో పోఖ్రాన్-2 అణుపరీక్ష అంతకు మించిన మలుపు. చైనా బెడద దృష్ట్యా భారత్‌కు అణు కార్యక్రమం అవసరమేనని వాదించి గెలవడం కూడా జరిగింది. దీనితోనే అణుపరీక్ష తరువాత అమెరికా,జపాన్,ఈయూ విధించిన ఆంక్షలు 2001కి తొలగిపోయాయి.
కొత్త ప్రపంచంలో
ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాలు కొత్త నిర్వచనాన్ని సంతరించుకు న్నాయి. చరిత్రలో పారిశ్రామిక విప్లవం వంటి పెద్ద పరిణామాలకు దూరంగా ఉండిపోయిన భారత్ ఆ లోటును భర్తీ చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నది ‘గ్లోబల్ విలేజ్’లో విస్తృతమైన దౌత్య క్రీడ. మనది చైనా తరువాత అతి పెద్ద మార్కెట్. సైనిక వ్యయంలో ఎనిమిదో స్థానం మనదే. ఈ వాస్తవాలతో పాటు, ఇరుగు పొరుగు పరిణామాలు కూడా మనం కొత్తదీ, వాస్తవికమైనదీ అయిన విదేశాంగ విధానం వైపు జరగక తప్పని స్థితినే కల్పించాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ ప్రయోజనాలను కాపాడుతూనే వాణిజ్య, రక్షణ దౌత్యాలకు మోడీ పెద్ద పీట వేయక తప్పదని అంచనా.
డాక్టర్ గోపరాజు నారాయణరావు