జిల్లాకు ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్లు
- కడప, ప్రొద్దుటూరుకు ఒక్కొక్కటి మంజూరు
- ఒక్కో సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.3 కోట్లు ఖర్చు
కడప అగ్రికల్చర్ : జిల్లాకు రాష్ట్ర విద్యుత్ సంస్థ రెండు ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్లను మంజూరు చేసింది. వీటిని జిల్లాలోని కడప నగరంలోను, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోను ఒక్కొక్కటి నిర్మించడానికి అధికారులు స్థలాన్వేషణ మొదలుపెట్టారు. దీని నిర్మాణ విలువ రూ.3 కోట్లు ఉంటుందని జిల్లాకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఇండోర్ సబ్స్టేషన్లను మన దేశంలోని పెద్ద పెద్ద నగరాల్లో ఇప్పటికే నిర్మించారు.
తెలంగాణలోని హైదరాబాద్‌లోను, ఏపీలోని విజయవాడలోను ఈ ఇండోర్ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. వీటిని మన జిల్లాలో కూడా నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. బయటకు ఏ మాత్రం కనిపించకుండా పూర్తిగా ఒక భవనంలోనే చాలా తక్కువ విస్తీర్ణంలో ఆధునిక పద్ధతుల్లో, అధిక పనితనం చూపే ఈ విద్యుత్ ఇండోర్సబ్స్టేషన్ నిర్మిస్తారు.
దీని నిర్మాణానికి కేవలం 8 సెంట్లు స్థలం అయితే సరిపోతుంది. అదే సాధారణ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించాలంటే దాదాపు 50 సెంట్ల స్థలం కావాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లు, కేబుళ్లు, కండెన్సర్లు, ఇతర సామగ్రి అంతా గదిలోనే ఇమిడిపోయేలా చేస్తారు. కడప నగరంలోని కొన్ని ప్రాంతాల్లో లోఓల్టెజీ సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ సమస్య నుంచి గ ట్టెక్కించేందుకు ఈ సబ్స్టేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు నెలల్లో ఈ సబ్స్టేషన్ల నిర్మాణ పనులు చేపట్టేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇండోర్ సబ్‌స్టేషన్‌లో మర్మమతులు వంటివి చాలా తక్కువగా ఉంటాయని అధికారులు అంటున్నారు. కేవలం ప్రమాదం లేని గ్యాస్ కిట్లను మారుస్తూ ఉంటే సరిపోతుందని విద్యుత్ శాఖ సాంకేతిక నిపుణులు తెలిపారు. ఈ సబ్‌స్టేషన్ వల్ల విద్యుత్ సమస్యలు ఉత్పన్నం కావన్నారు.