మద్యం మత్తులో 'షీనా' గుట్టు విప్పాడు
ముంబై: క్రైమ్ వార్తలకు ఎందుకంత ప్రాధాన్యం లభిస్తుంది? ఎందుకంటే ప్రతి నేరం తనదైన కొత్త తరహాలోచోటుచేసుకుంటుంది. ఎంటర్టైన్మెంట్ కంటే మిన్నగా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఎంతటి నేరమైనా చివరికి వెలుగులోకి రాకాతప్పదని.. నేరస్తులకు శిక్షా తప్పదని తెలిసిందే! ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసూ అలాంటిదే. మర్డర్ జరిగిన మూడేళ్ల తర్వాత.. మద్యం మత్తు తలకెక్కిన ఒక సాయంత్రాన షీనా హత్య గుట్టువీడింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడు, ఇంద్రాణి ముఖర్జియా మాజీ డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్.. మర్డర్ మిస్టరీని ఎలా రివీల్ చేసిందీ పోలీసు అధికారి ఒకరువెల్లడించారు.
ముంబైలో (2012) కదులుతున్న కారులో షీనాను హత్య చేసిన అనంతరం ఇంద్రాణి ముఖర్జియా, ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ లు కలిసి శవాన్ని రాయ్ గఢ్ అడవుల్లో పాతిపెట్టారు. ఆ తరువాత సంజీవ్ కోల్ కతాకు, ఇంద్రాణి ఇంగ్లాండ్ కు వెళ్లిపోయారు. శ్యామ్ రాయ్ సొంత ఊరికి వెళ్లి కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు.. ఇంద్రాణి ఇచ్చిన 5 లక్షల రూపాయలత!
ఊర్లో వ్యాపారాన్ని నమ్మకస్తుడైన స్నేహితుడికి అప్పజెప్పి మళ్లీ ముంబై వచ్చి ఆటో డ్రవర్ అవతారం ఎత్తాడు. సహచర డ్రైవర్లకు అప్పుడప్పుడు మందు పార్టీలు గట్రా ఇచ్చేవాడు. అలా ఓ రోజు మద్యం మత్తులో.. మూడేళ్లుగా తన మనసులోనే దాచుకున్న మర్డర్ మిస్టరీని తోటి ఆటోడ్రైవర్ కు చెప్పేశాడు. విన్నవాడు మామూలోడు కాదు.. పోలీస్ ఇన్ఫార్మర్!
ఖర్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ దినేశ్ కదమ్ కు నమ్మకమైన ఇన్ఫార్మర్లలో ఒకడైన ఆ ఆటోడ్రైవర్.. శ్యామ్ రాయ్ తనతో పంచుకున్న విషయాలన్నీ పూసగుచ్చాడు. 'షీనా హత్య గురించిగానీ, ఇంద్రాణి ముఖర్జియా గురించిగానీ తెలిసే అవకాశం లేదని నమ్మడం వల్లే శ్యామ్ రాయ్.. తోటి ఆటో డ్రైవర్ దగ్గర గుట్టు విప్పి ఉంటాడు' అని శ్యామ్ అరెస్టు అనంతరం ఇన్ స్పెక్టర్ దినేశ్ కదమ్ చెప్పారు.
ఇన్ఫార్మర్ చెప్పిన సంగతుల ఆగస్లు 21న శ్యామ్ రాయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా షీనా హత్య, శవం పూడ్చివేత తదితర నేరాలను శ్యామ్ ఒప్పేసుకున్నాడు. తర్వాతి వారమే ఖర్ పోలీసులు కేసు నమోదు చేసి ఇంద్రాణియా ముఖర్జీను అరెస్టు చేశారు. అయితే శ్యామ్ రాయ్ వెల్లడించిన అంశాలను మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేసేలోపే కేసుపై రాజకీయదుమారం చెలరేగింది. ప్రస్తుతం షీనా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.