సింధు జలాలపై సందిగ్ధతే
వాషింగ్టన్: సింధు నదీజలాల ఒప్పందంపై భారత్–పాక్ మధ్య జరిగిన తాజా చర్చలు సత్ఫలితాలనివ్వలేదు. వాషింగ్టన్లో ప్రపంచబ్యాంకు కార్యాలయంలో భారత్, పాకిస్తాన్ మధ్య రాత్లే, కిషన్‌గంగ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై రెండ్రోజులపాటు జరిగిన రెండో విడత చర్చలూ ఫలితం తేలకుండానే ముగిశాయి. చర్చల్లో సయోధ్య కుదిరేంతవరకు తమ ప్రయత్నం కొనసాగుతోందని ప్రపంచబ్యాంకు తెలిపింది. సింధు నదీ జలాల ఒప్పందానికి లోబడి కిషన్‌గంగ, రాత్లే జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక అంశాలపై ఇరుదేశాల మధ్య కార్యదర్శి స్థాయి చర్చలు జరిగాయి.
భారత్–పాక్ దేశాల మధ్య 9 ఏళ్లపాటు సుదీర్ఘమైన చర్చలు జరిగిన అనంతరం ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా ఇరుదేశాల మధ్య వివాదాలు, భేదాభిప్రాయాలు తలెత్తినపుడు పరిష్కరించే విషయంలో ప్రపంచబ్యాంకు పాత్ర పరిమితంగానే ఉంటుంది. భారత్, పాక్‌లలో ఎవరైనా ఒకరు కోరితే తప్ప ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉండదు. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ సింగ్ నేతృత్వంలో భారత బృందం ఈ చర్చల్లో పాల్గొంది. ఇందులో సింధు నదీ జలాల కమిషనర్, విదేశాంగ శాఖ, కేంద్ర జల సంఘం ప్రతినిధులున్నారు. ఆగస్టు ఒకటిన జరిగిన తొలి విడత చర్చలూ ఎటూతేలకుండానే ముగిశాయి.