స్మార్ట్ఫోన్ల ట్రెండ్ రివర్స్
భారత్‌లో మొబైల్ పరిశ్రమ... ఇన్నాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో కొత్తపుంతలు తొక్కుతూ దూసుకెళ్లింది. 2జీ, 3జీ, 4జీ స్మార్ట్ఫోన్ల లాంచింగ్‌లతో అత్యాధునికమైన ఫీచర్లున్న ఫోన్లను మనం చూశాం. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు విపరీతమైన దూకుడుకు ఉన్న భారత్‌పై మొబైల్ కంపెనీలన్నీ దృష్టిపెట్టాయి. కానీ ఈ దూకుడుకు గత మూడేళ్లలో మొదటిసారి బ్రేక్ పడిందట. ముందటి ఏళ్లతో పోలిస్తే, ఈ ఏడాది ప్రథమార్థంలో ట్రెండ్ రివర్స్ అయింది. కొత్త స్మార్ట్ఫోన్ల లాంచింగ్ పడిపోయిందట. ధరల విషయంలో వినియోగదారుల అభిరుచుల మార్పు, చైనీస్ బ్రాండ్లనుంచి నెలకొన్న తీవ్ర పోటీ వాతావరణం, బహుళజాతీయ కంపెనీల ఏర్పాటు వంటివి స్మార్ట్ఫోన్ల దూకుడుకు అడ్డుకట్టవేశాయని భారత మొబైల్ ఫోన్ పరిశ్రమ తెలిపింది.
2016 ప్రథమార్థంలో మొబైల్ పరిశ్రమ తీరుతెన్నులు...
దేశీయంగా మొబైల్ ఫోన్ ఆవిష్కరణలు 2015 ప్రథమార్థంతో పోలిస్తే, 2016 ప్రథమార్థంలో 29 శాతం క్షీణించాయి.
మొదటిసారి వినియోగదారులు రూ.5000కు తక్కువున్న ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ ఫోన్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. దీంతో ఈ సెగ్మెంట్ ఫోన్ల అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి.
ముందటిలాగే ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కంపెనీనే స్మార్ట్ఫోన్లకు రారాజుగా నిలిచింది. మైక్రోమ్యాక్స్, హెచ్టీసీలను వెనక్కినెట్టేసి, లెనోవా, షియోమిలు వాటి స్థానాలను ఆక్రమించుకున్నాయి.
వివో తర్వాత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా ఓపో నిలిచింది.
ముందటి కాలంలో మొబైల్ పరిశ్రమను ఏలిన నోకియా, బ్లాక్ బెర్రీ ఫోన్లు మెల్లమెల్లగా కనుమరుగయ్యే స్థానానికి పడిపోతున్నాయి. అదేవిధంగా మైక్రోమ్యాక్స్ వైయూ ఈ ఏడాది కూడా విజయ బాటలో నడవలేక సతికల పడిపోయింది.
చైనీస్ బ్రాండ్లు యూజర్ వీక్షణలో తమ షేరును 2015 ప్రథమార్థం కంటే 2016 ప్రథమార్థంలో రెట్టింపు చేసుకున్నాయి.
ఆన్లైన్లో మాత్రమే ఇన్నాళ్లు ఫోన్లను విక్రయించే కంపెనీలు, ఆఫ్‌లైన్ మార్కెట్లోకి అరంగేట్రం చేస్తున్నాయి. దీనికి గల ప్రధాన కారణం ఆన్లైన్ మార్కెట్లో కఠినతరమైన నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తేవడమే. దీంతో భారీ డిస్కౌంట్లకు కళ్లెం పడింది.
షియోమి రెడ్మి నోట్3, 2016 ప్రథమార్థంలో మోస్ట్ పాపులర్ ఫోన్‌గా చోటు దక్కించుకుంది.