ఐసీయూలో ఎలుక బారినపడ్డ మరో శిశువు
నిండా రెండు నెలలు కూడా వయసులేని ఓ మగశిశువు ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతుంటే.. ఓ ఎలుక అతడి ముక్కును కొరికేసింది. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. దీంతో ఒక స్టాఫ్ నర్సును సస్పెండ్ చేయగా, మరో కేర్‌టేకర్‌ను ఉద్యోగం నుంచి తీసేశారు. రెండు మూడు రోజుల క్రితమే ఆ పిల్లాడి ముక్కును ఎలుక కొరికేసినా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకటిన్నర నెలల క్రితం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పుట్టిన ఆ పిల్లాడి ఆరోగ్యం బాగా క్షీణించడంతో అతడిని ధార్ జిల్లా ఆస్పత్రిలో చేర్చేసి తల్లిదండ్రులు వెళ్లిపోయారని సివిల్ సర్జన్ డాక్టర్ సీఎస్ గంగ్రాడే చెప్పారు.
తర్వాత ఆ పిల్లాడికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతుండగా అతడి ముక్కును ఎలుక కొరికేసింది. పైపెచ్చు ఆ శిశువు పిల్లల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి స్టాఫ్ నర్సు సోనాలీ భిడేను సస్పెండ్ చేశామని, ఆశా రాథోడ్ అనే కేర్‌టేకర్‌ను ఉద్యోగం నుంచి తీసేశామని డాక్టర్ గంగ్రాడే తెలిపారు.