కాకినాడలో డిఫ్తీరియా.. ఆరేళ్ల బాలుడి మృతి
సాక్షి, కాకినాడ :
డిఫ్తీరియా... ఐదేళ్ల లోపు చిన్నారులకు వచ్చే ప్రాణాంతక వ్యాధి.. దగ్గు, తుమ్ముల ద్వారా ఒకరి నుంచి మరొకరి వేగంగా సోకే అంటువ్యాధి. దీన్ని కంఠసర్పి లేదా గొంతువాపు వ్యాధి అని కూడా అంటారు. పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని భావి స్తున్న తరుణంలో ఈ వ్యాధి విజృంభిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఒక చిన్నారి మృత్యువాతపడగా, ఐదుగురు ఈ వ్యాధితో బాధపడుతున్నట్టుగా నిర్ధారణైంది. మరో 15మంది చిన్నారు లకు ఈ వ్యాధి సోకినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
జిల్లా కేంద్రమైన కాకినాడ నగరంలో డిఫ్తీరియా(కంఠసర్పి) ఆందోళన కల్గించేలా విజృంభిస్తోంది. సాధారణంగా ఐదేళ్లలోపు చిన్నారులకు వ చ్చే ఈ వ్యాధి ఐదేళ్ల నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు సోకుతుండడం జిల్లా యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. మూడు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా లో వెలుగు చూసిన ఈ డిఫ్తీరియా జిల్లావాసులను భయపెడుతోంది. నాలుగు రోజుల క్రితం ఈ వ్యాధి సోకి ఏటిమొగకు చెందిన పెమ్మాడి కళ్యాణ్ (6) సోమవారం అర్ధరాత్రి మృత్యువాత పడ్డాడు. భర్తతో విడివడి కొడుకు, కూతురితో జీవనం సాగి స్తున్న ఆదిలక్ష్మి కొడుకు కల్యాణ్‌ను పొగొట్టుకోవడంతో కన్నీరుమున్నీరవుతోంది. అదే ప్రాంతానికి చెందిన కట్టా మధు(5) సంజయ్‌నగర్‌కు చెందిన బాసి రమ్య(5), కొవ్వూరు రోడ్డుకు చెందిన కోరుకొండ మనోహర్(12) తో పాటు సంజయ్‌నగర్‌కు చెందిన మరో ఏడేళ్ల చిన్నారికి వైద్యపరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణైంది. వీరుకాకుండా నగరంలో మురికివాడలకు చెందిన సుమారు 15 మంది చిన్నారులకు ఈ వ్యాధి సోకినట్టు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. ఏడేళ్ల లోపు చిన్నారుల వరకు ఈ వ్యాధి సోకకుండా డీపీటీ బూస్టర్ డోస్ ఇస్తే సరిపోతుంది. కానీ వ్యాధి సోకుతున్న వారు 10 ఏళ్లకు పైబడినవారు కావడం, ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఎటూ పాలుపోని పరిస్థితిలో అధికారులున్నారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లా స్థాయిలో వైద్య ఆరోగ్యశాఖాధికారులు కాకినాడ నగరపాలక వైద్యఆరోగ్య శాఖాధికారులతో కలిసి అధ్యయనం చేస్తున్నారు. మరోపక్క ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కుటుంబ సంక్షేమాశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. వ్యాధికి గురైన వారిని గుర్తించేందుకు ఇంటింటా సర్వే చేపట్టగా, మురికివాడల్లో అవగాహన కల్పించే చర్యలు చేపట్టారు.
వ్యాధి లక్షణాలు
తీవ్రమైన జ్వరం రావడం..కొండనాలుక వద్ద టాన్సిల్స్‌పై తెల్లని లేయర్ ఏర్పడం..నాలుకపై పుండ్లు ఏర్పడడం..గొంతు నొప్పి తీవ్రంగా ఉండడం ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. సకాలంలో గుర్తించకపోతే స్వరపేటిక(వాయిస్బాక్సు)కు సోకి ఆ తర్వాత ఊపిరితిత్తులకు చేరుకుని ప్రాణాంతకమవుతుంది. వ్యాధి తీవ్రమైతే ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టమే. దగ్గు..తుమ్ముల ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది.
వ్యాధిని ఎలా గుర్తించాలి...సోకితే ఏం చేయాలి
గొంతుపరీక్ష ద్వారా మాత్రమే ఈ వ్యాధిని గుర్తించాలి. ప్రాథమిక దశలో గుర్తిస్తేనే మెరుగైన వైద్యం అందించవచ్చు. పరిస్థితి విషమిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. సకాలంలో ఆస్పత్రిలో చే ర్చి ఎరిత్రోమైసిన్ లేదా యాంటిబయాటిక్ ఇస్తే సరిపోతుంది. అయితే వ్యాధి తగ్గే వరకు ఈఎన్టీ వైద్యుల పర్యవేక్షణలో వైద్యం చేయిస్తే 15 రోజుల్లోనే కోలుకొనే అవకాశం ఉంది.
ఏ సమయంలో వ్యాక్సిన్లు వేయాలి ?
సాధారణంగా డిప్తీరియా (కంఠసర్పి), పెర్టుసిస్ (ఊపిరాడకుండా వచ్చే దగ్గు), టెటనస్ (ధనుర్వాతం) నివారణకు చిన్నారులకు 45 రోజులు,75 రోజులు, 105 రోజులకు హైపటైటిస్ బీ, పోలియో వ్యాక్సిన్లతో కలిపి డీపీటీ ఇస్తారు. ఆ తర్వాత 18నెలలకు, ఐదేళ్లకు, ఏడేళ్లకు డీపీటీ బూస్టర్డోస్లివ్వాలి. ఈ వ్యాధికి కారకమైన ‘కార్ని బాక్టీరియం డిప్తీరియా’అనే బ్యాక్టీరియా ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఉంటుంది. వ్యాధి నిరోధకశక్తి అధికంగా ఉన్నంత వరకు ఈ బ్యాక్టీరియా ఏమీ చేయలేదు. ఆ శక్తి తగ్గినప్పుడు ఈ వ్యాధి విజృంభిస్తుంది.
వైద్యశాఖ కార్యాచరణ
నగరంలో మరీ ముఖ్యంగా మత్స్యకారప్రాంతాల్లో ఈ వ్యాధి విజృంభిస్తున్నందున పదేళ్ల లోపు చిన్నారులందరికి మరోసారి డీపీటీ బూస్టర్ డోస్ ఇవ్వాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారులు నిర్ణయించారు.
ముందుగా గుర్తిస్తే ప్రాణాంతకం కాదు
ఈ వ్యాధి గొంతునొప్పితో ప్రారంభమవుతుంద ని ప్రభుత్వాసుపత్రి ఈఎన్టీ స్పెషలిస్టు ప్రొఫెసర్ డాక్టర్ జీఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు. మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాధి అంతరించి పోయినదైనా వైరస్ నిద్రాణమై ఉండి మార్పును సంతరించుకుని రావడం వింతేమీ కాదన్నారు. ప్రారంభంలో గొంతు నొప్పికి ఎరిత్రోమైసిన్ వేస్తే నయమవుతుందని దానికి లొంగక పోతే గ్రామాల్లోని ఆర్ఎంపీలు, సాధారణ డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్‌కు సిఫార్సు చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తి కాకుండా చూడాలన్నారు.