అంగన్వాడీ దీక్షలు భగ్నం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు బుధవారం నాటికి రెండో రోజు చేరుకున్నాయి. బుధవారం సాయంత్రం పోలీసులు అంగన్వాడీ కార్యకర్తల దీక్షలను భగ్నం చేసి, చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అంతకు ముందు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. ప్రైవేటీకరణను వేగవంతం చేస్తూ ప్రజల నుంచి ఐసీడీఎస్‌ను వేరు చేస్తున్నారన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సిబ్బంది వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి చుక్క రాములు మాట్లాడుతూ అంగన్వాడీ దీక్షకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు.
ఉద్యోగుల పనులతో పాటు వివిధ సర్వేలలో ప్రభుత్వం వీరి సేవలను వినియోగించుకుంటుందన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్, సూపర్వైజర్ వయో పరిమితి సడలించాలని, ప్రసూతి, వేసవి సెలవులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులను నియంత్రించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దీక్షలకు ప్రజా సంఘాల నాయకులు జయరాజ్, సుధాకర్, సర్దార్, మాణిక్యం మద్దతు పలికారు.