ప్రైవేటు ఆస్పత్రిలో బాలుడి మృతి
ఇంజక్షన్ వికటించడం వల్లనేనని
బంధువుల ఆరోపణ
హాస్పిటల్ ఎదుట ఆందోళన
మహబూబాబాద్ : ఇంజక్షన్ వికటించి 10 సంవత్సరాల బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం మానుకోట పట్టణంలోని సుబ్రహ్మణ్యం క్లినిక్‌లో చోటు చేసుకుంది. ఆర్ఎంపీ వైద్యుడు ఆ బాలుడికి చేసిన చికిత్స మూలంగా ఫిట్స్‌తో మృతి చెందాడు. బాలుడి తల్లి కథనం ప్రకారం.. మానుకోట పట్టణ శివారులోని రామన్నపేట కాలనీకి చెందిన ఎస్కె.జరీనా, జానీ దంపతులకు ఇద్దరు కుమారులు. జరీనా తన పెద్ద కుమారుడు అస్రద్ (10), చిన్న కుమారుడు ఫరోజ్‌తో కలిసి బుధవారం తల్లిగారింటికి వచ్చింది. అస్రద్కు తీవ్ర జ్వరం ఉండటంతో పట్టణంలోని సుబ్రహ్మణ్యం క్లినిక్‌కు తీసుకెళ్లారు. ఆర్ఎంపీ వైద్యుడు జ్ఞానేశ్వర్ ఆ బాలుడికి ఇంజక్షన్ ఇవ్వగా, ఆ తర్వాత కొద్ది సేపటికే చాతి, గుండె వద్ద నొప్పిగా ఉందని చెప్పాడు. తర్వాత మూత్ర విసర్జనకు బయటకు వచ్చాడు. అప్పటికే శరీరంపై దద్దుర్లు, ఆ తర్వాత ఫిట్స్ వచ్చి మృతి చెందాడు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే అస్రద్ మృతి చెందాడని బాలుడి బంధువులు, పలు సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో టౌన్ ఎస్సై ప్రసాద్‌రావు, ట్రైయినీ ఎస్సై మురళీధరరాజు వచ్చి బందోబస్తు నిర్వహించారు. వైద్యుడిపై చర్య తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై టౌన్ సీఐ నందిరామ్ నాయక్‌ను వివరణ కోరగా బాధితుల నుంచి ఫిర్యాదు అందలేదన్నారు. కొన్ని సంఘాల నాయకులు మాత్రం ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారని చెప్పారు.