Input subsidy funds
-
ఇన్పుట్ సబ్సిడీ రూ.1.66 కోట్లు
కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ నిధులు విడుదలయ్యాయి. 2011 నుంచి ఇప్పటి వరకు వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన 1999 మంది రైతులకు ప్రభుత్వం రూ.1.66 కోట్ల మొత్తాన్ని విడుదల చేసిందని జేడీఏ ఠాగూర్ నాయక్ గురువారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. 2011 మే లో ఓర్వకల్లు మండలంలో పంటలు కోల్పోయిన ఐదుగురు రైతులకు రూ.18,600, 2012 మార్చి, ఏప్రిల్‌లో పాణ్యం, మహానంది, బండి ఆత్మకూరు మండలాల్లో 776 మంది రైతులకు రూ.36,47,500, అలాగే 2013 ఫిబ్రవరిలో బనగానపల్లె, నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా మండలాల్లో పంటలు నష్టపోయిన 1218 మంది రైతులకు రూ.64 లక్షల పరిహారం పంపిణీ చేయనున్నట్లు జేడీఏ తెలిపారు. -
ఇన్పుట్ సబ్సిడీ నిధుల పక్కదారి!
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : వ్యవసాయశాఖ అధికారి హెచ్చరిక, ఆ శాఖ జేడీ వివరణను బట్టి.. నీలం తుపాను కారణంగా జిల్లాలో పంట నష్టపోయిన రైతుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన ఇన్పుట్ సబ్సిడీ నిధులు పక్కదారి పట్టినట్టు స్పష్టమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రైవేట్ బ్యాంకులో పెద్దమొత్తంలో నిధులు డిపాజిట్ చేసినట్టు వెల్లడైంది. వివరాలు.. నీలం తుపాను బాధిత రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు కొన్ని నెలల క్రితం నిధులు విడుదలయ్యాయి. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఈ నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయలేకపోయారు. జిల్లాకు ఇటీవల వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ ఇన్‌ఫుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో త్వరలోనే జమ అవుతుందని ప్రకటించారు. దీంతో జిల్లా అధికారులు కొద్దిరోజుల నుంచి ఆ పనిలో పడ్డారు. అయితే సొమ్ము జమలో అనేక పొరపాట్లు జరిగినట్టు వెల్లడవటంతో బుధవారం ఉదయం పలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ హడావుడి చేశారు. ఓ ప్రైవేట్ బ్యాంక్ సిబ్బందిని బ్యాంకు వేళలకు ముందుగానే పిలిపించి చర్చించారు. ఎందుకు ఇలా చేశారనేది గోప్యంగా ఉంచినప్పటికీ పెద్ద మొత్తంలో నిధులకు లెక్కలు దొరకలేదని, ఒకరి ఖాతాకు బదులు వేరొకరి ఖాతాల్లోకి సొమ్ము జమ అయిందని సమాచారం. ఎవరికీ తెలియదనే ధీమాతో.. నీలం తుపాను వచ్చి ఏడాది దాటింది. తమకు ఎంత ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందనేది చాలామంది రైతులకు తెలియదు. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. అధికారుల హడావుడి కారణంగా బ్యాంకుల్లో సాధారణ లావాదేవీలకు విఘాతం కలగటంతో కొందరు ఖాతాదారులు బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించారు. వారు అసలు విషయం చెప్పటంతో సమాచారం బయటకు పొక్కింది. నిబంధనలకు విరుద్ధంగా.. జిల్లాకు విడుదలయ్యే ప్రభుత్వ నిధులను ఏదో ఒక జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయడం పరిపాటి. వ్యవసాయశాఖ ఇందుకు విరుద్ధంగా ఓ ప్రైవేట్ బ్యాంకులో రూ.10 కోట్లకు పైగా జమ చేసింది. జాతీయ బ్యాంకులకు గ్రామీణ ప్రాంతాల్లో సైతం శాఖలు ఉంటాయి. జిల్లాలో ఎస్బీఐ శాఖలు ఎక్కువగా ఉండగా ఆంధ్రాబ్యాంకు, ఏపీజీవీబీ శాఖలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటిని విస్మరించి జిల్లా మొత్తమ్మీద ఒకటి, రెండు శాఖలున్న ప్రైవేట్ బ్యాంకులో నిధులు జమ చేయడం గమనార్హం. నిధులు డిపాజిట్ చేయించేందుకు ప్రైవేట్ బ్యాంకులవారు అధికారులకు భారీ బహుమతులను ఎరగా వేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలా జరగటం గమనార్హం. అధికారుల తీరు కారణంగా రైతులు నష్టపోనున్నారు. ఎందుకంటే.. వేరొక బ్యాంకు ఖాతాకు నిధులు బదిలీ చేసేందుకు ప్రతి బ్యాంకు కొంత కమీషన్‌ను ఖాతాదారు నుంచి వసూలు చేస్తుంది. ఇంతటి ఆగితే కొంతలో కొంత నయం. అదే అసలుకే ఎసరు పెడితే ఇప్పటికే నడ్డి విరిగిన రైతన్నకు దిక్కెవరు?