ఇదేం ‘ప్రేరణ’?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పాఠశాల విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పం దారి మళ్లింది. విద్యార్థులో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలనుకున్న ఆశయం నీరుగారింది. ‘ప్రేరణ’ అవార్డు గ్రహీతలంతా రెడీమేడ్ మాయలో పడడంతో సర్కారు లక్ష్యం గాడి తప్పింది. చదువుతోపాటు వారిలో
సృజనాత్మకతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇన్స్పైర్’(ప్రేరణ) పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఇందులో భాగంగా ఒక్కో విద్యార్థికి రూ.ఐదు వేలు విడుదల చేస్తుంది. ఈ నిధులతో విద్యార్థిలోని విన్నూత్న ఆలోచనలకు పదునుపెట్టి ఒక ప్రాజెక్టును తయారుచేసి ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇంతటి మహోన్నత ఆశయంతో తలపెట్టిన ఈ కార్యక్రమం ఏమాత్రం ఫలితాన్నివ్వడం లేదు.
జిల్లా విద్యార్థులకు రూ.1.03 కోట్లు
‘ఇన్స్పైర్’ పథకం కింద జిల్లాలో 2,064 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఒక్కో విద్యార్థికి రూ.ఐదు వేల చొప్పున వారి ఖాతాలో జమచేస్తారు. విద్యార్థికిచ్చిన నిధులనుంచి 50శాతం ప్రాజెక్టు కోసం వినియోగించాల్సి ఉండగా.. మిగతా 50శాతం రవాణా చార్జీలకు ఖర్చు చేయాలి.
విద్యార్థి తయారు చేసిన ప్రాజెక్టును నిర్దేశించిన వైజ్ఞానిక ప్రదర్శన కేంద్రంలో ప్రదర్శించాలి. ఇందులో భాగంగా గత నెలాఖర్లో తాండురులో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించగా, ఈనెల రెండోతేదీ నుంచి ఇబ్రహీంపట్నంలో ప్రదర్శన కొనసాగింది. తాండూరులో 336 మంది విద్యార్థులు వారి ప్రాజెక్టులు ప్రదర్శించగా, ఇబ్రహీంపట్నంలో 553 మంది వారు తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శనకు తీసుకొచ్చారు. అయితే ఇందులో సగానికిపైగా రెడీమేడ్ ప్రాజెక్టులు కావడం గమనార్హం. ఈ ప్రాజెక్టుపై సబ్జెక్టు టీచర్లు దృష్టి సారించి విద్యార్థులకు సలహాలివ్వాల్సి ఉండగా.. ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించడంతో సర్కారు ఆశయం ఇలా పక్కదారిపడుతోంది.
కొనుక్కొచ్చి చూపించారు..
ఇప్పటివరకు జిల్లాలో జరిగిన రెండు వైజ్ఞానిక ప్రదర్శనల్లో అధికసంఖ్యలో విద్యార్థులు రెడీమేడ్ ప్రాజెక్టులనే తీసుకొచ్చారు. నగరంలోని అమీర్‌పేట, ఎస్ఆర్నగర్, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం తయారుచేసే పరికరాల దుకాణాల్లోనుంచి నేరుగా కొనుగోలు చేసి వైజ్ఞానిక ప్రదర్శనకు తీసుకురావడం విశేషం.
ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఆటోమెటిక్ స్ట్రీట్‌లైట్ ప్రాజెక్టును కొనుగోలు చేసి నేరుగా ప్రదర్శన కేంద్రం వద్దే తెరిచి ప్రదర్శించారు. ఇదే మండలానికి చెందిన మరో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి తెచ్చిన పొల్యూషన్ కంట్రోల్ ప్రాజెక్టు సైతం కొనుగోలు చేసి తీసుకువచ్చి ప్రదర్శన కేంద్రం వద్దే సీల్ తెరవడం గమనార్హం. పట్టణ మండలానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్ధి తయారుచేసిన సోలార్ ప్రాజెక్టు సైతం కొనుగోలు చేసిందే.
ఇలా దాదాపు వందకుపైగా రెడీమేడ్ ప్రాజెక్టులు కావడంతో ప్రదర్శనను తిలకించేందుకు వచ్చిన పలువురు విస్తుపోయారు. గతనెలలో జరిగిన తాండూరు ప్రదర్శనలోనూ ఇదే తరహాలో కొనుగోలు చేశారు. సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులే ఈ రెడీమేడ్ సలహాలిస్తుండడంతో విద్యార్థుల్లో సృజనాత్మకతకు స్థానం దక్కే అవకాశం లేకుండాపోతోంది.