బీమా బ్రోకింగ్‌లో ఎఫ్ఐఐ పెట్టుబడులకు ఓకే
న్యూఢిల్లీ: బీమా సంబంధిత బ్రోకింగ్, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్, సర్వేయర్స్ వంటి విభాగాల్లో ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి నిబంధనలను ప్రభుత్వం సడలించింది. ఇకపై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, ప్రవాస భారతీయులు కూడా వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించింది. ఈ రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితైన 26 శాతానికి ఇది లోబడి ఉంటుంది. ఈ మేరకు పారిశ్రామిక ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) బుధవారం ఒక ఆదేశాలు జారీ చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.
ప్రస్తుతం ఎఫ్‌డీఐలను అదీ ఆటోమేటిక్ రూట్లో 26 శాతం మాత్రమే బీమా కంపెనీల్లో అనుమతిస్తున్నారు. దీన్నే 49 శాతానికి పెంచాలంటూ బీమా రంగం డిమాండ్ చేస్తుండగా.. పరిమితిని పెంచకుండా ఎఫ్ఐఐ, ఎన్నారైల పెట్టుబడులను అనుమతించడం గమనార్హం. విదేశీ పెట్టుబడులు తెచ్చుకుంటున్న బీమా సంబంధిత సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాల కోసం బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ నుంచి తప్పనిసరిగా లెసైన్సులు పొందాల్సి ఉంటుదంని డీఐపీపీ పేర్కొంది.