ఇంటికి చేరిన ‘బంగారు తల్లి’
కౌడిపల్లి, న్యూస్‌లైన్:
ఎట్టకేలకు ‘బంగారు తల్లి’ ఇంటికి చేరింది. అవగాహన లేక శిశువును విక్రయించారని తెలుసుకుని రంగంలోకి దిగిన అధికారులు సుమారు పది రోజులు తరువాతఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. మండలంలోని సలాబత్పూర్ దయ్యాల తండాకు చెందిన హలావత్ జైసింగ్, శాంతిలకు గతనెల 29న ఆడ శిశువు జన్మించింది. పుట్టిన నాలుగు రోజులకే ఆ చిన్నారిని విక్రయించారు. అశోక్‌తోపాటు మరికొందరు మధ్యవర్తిత్వం నెరపగా సదరు శిశువును బీహెచ్ఈఎల్కు చెందిన కె.శ్రీనివాస్, జ్యోతి దంపతులు కొనుగోలు చేశారు. శిశు విక్రయం జరిగినట్టు ప్రచారం జరగడంతో ఐసీడీఎస్, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు.
ఐసీడీఎస్‌లో భాగమైన ఐసీపీఎస్ (ఇంటీగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్) జిల్లా కోఆర్డినేటర్ రత్నం సూచన మేరకు శనివారం సీడబ్ల్యూసీ (చైల్డ్ వెల్ఫర్ కమిటీ) సభ్యుడు సున్నంసతీష్, ఐసీపీఎస్ సభ్యుడు విఠల్, సర్పంచ్ చిన్నసాయిరెడ్డి, వీఆర్ఓ మోహన్‌రెడ్డి, ఉపసర్పంచ్ బుడ్యానాయక్, మాజీ ఉపసర్పంచ్ శాబొద్దీన్, చైల్డ్‌లైన్ కార్యకర్త షాహిన్, సుభాష్ తదితరులు వెంకట్రావ్పేట గేటు వద్ద ఇరు కుటుంబాలతో సమావేశమయ్యారు. శిశువును విక్రయించడం, కొనుగోలు చేయడం నేరమని వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందుకు మద్దతు తెలిపిన వారు కూడా బాధ్యులేనని వారు పేర్కొన్నారు. దీంతో శిశువును కొనుగోలు చేసిన కె.శ్రీనివాస్ నుంచి చిన్నారిని తీసుకుని తల్లిదండ్రులైన జైసింగ్, శాంతిలకు అప్పగించారు. శిశుపోషణ భారమవుతుందని తిరిగి అమ్మడానికి ప్రయత్నిస్తే కేసు పెడతామని వారు హెచ్చరించారు. ఎట్టకేలకు దసరా ముందు బంగారు తల్లి ఇంటికి చేరడంతో కథ సుఖాంతమైంది.